ఏప్రిల్ 22 నుంచి మే 22వ తేదీ వరకు
ఏర్పాట్లు చేస్తున్న ప్రవాస భారతీయులు
నెల రోజులు శని, ఆదివారాల్లో కార్యక్రమాలు
దుర్గగుడి అర్చకులకు ఆహ్వానం
విజయవాడ : అమెరికాలో దుర్గమ్మ పూజలు నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు అమెరికాలోని ప్రవాస భారతీయులు అమ్మవారి పూజలు చేసేందుకు దుర్గగుడి అర్చకులకు ఆహ్వానం పలికారు. వారి కోరిక మేరకు దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, అర్చకులు కోట ప్రసాద్, శంకరశాండిల్య, మారుతి యజ్ఞ నారాయణశర్మ, అమ్మవారి అలంకారం చేయడానికి పరిచార కుల శంకరమంచి ప్రసాద్, కె.గోపాలకృష్ణ తదితరులు ఏప్రిల్ 18న అమెరికా వెళ్లనున్నారు.
22 నుంచి నెలరోజుల పాటు పూజలు
ఏప్రిల్ 22 నుంచి మే 22వ తేదీ వరకూ నెల రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో దుర్గమ్మకు త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్రనామ పూజలు, రుద్రాభిషేకాలు, నవార్చనలు నిర్వహించనున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ పూజలు జరుగుతాయి. దీనికోసం హరిద్వారలోని శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్ర మం నుంచి పంచలోహాలతో చేసిన ప్రత్యేక శ్రీచక్రాన్ని తెప్పించారు. రోజూ కనీసం 300 నుంచి 500 మంది దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని దేవస్థానం అర్చకులు అంచనా వేస్తున్నారు. ఈ పూజలు నిర్వహించినందుకు దేవస్థానానికి ప్రవాస భారతీయులు రూ.30లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు దేవస్థానం సిబ్బందికి అయ్యే ఖర్చులూ వారే భరిస్తారు.
లాస్ ఏంజిల్స్‌లో దుర్గమ్మ ఆలయం?
అమెరికాలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయాల తరహాలోనే శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించేందుకు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. చెన్నూరు సుబ్బారావు, బొల్లా అశోక్ కుమార్, బుచ్చిరామ ప్రసాద్, అన్నవరపుకుమార్ తదితరులు పూజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు లాస్‌ఏంజిల్స్ లేదా టెక్సాస్‌లో దేవాలయం నిర్మించేందుకు ముందుకు వచ్చారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రస్తుతం పూజలు నిర్వహించడం వల్ల దేవాలయ నిర్మాణానికి మరింతమంది దాతలు ముందుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెరికాలో దుర్గమ్మకు పూజలు
Published Fri, Apr 1 2016 8:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement