శ్రీమఠంలో ఘనంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో ధనుర్మాసం సందర్భంగా వేకువ జామునే పూజలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప పంచామృతాభిషేకాలు, పట్టువస్త్ర సమర్పణ చేశారు. బృందావన ప్రతిమను బంగారుపల్లకీలో మాడా వీధుల్లో ఊరేగించారు. పీఠాధిపతి జయ, దిగ్విజయ, మూలరాముల పూజలో తరించారు. అన్నపూర్ణ భోజన శాలలో 8 గంటలకే భోజనాలు మొదలు పెట్టారు. భక్తులు వేలాదిమంది రావడంతో శ్రీమఠం, వ్యాపార దుకాణాలు కళకళలాడాయి. మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.