ఒక్కో సీటు రూ.లక్షన్నర! | Each seat is Rs 1.5 Laks | Sakshi
Sakshi News home page

ఒక్కో సీటు రూ.లక్షన్నర!

Published Tue, Nov 3 2015 12:30 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

ఒక్కో సీటు రూ.లక్షన్నర! - Sakshi

ఒక్కో సీటు రూ.లక్షన్నర!

రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) ప్రవేశాల్లో కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలు వసూళ్లకు

♦ అడ్డగోలుగా ఎంఈడీ సీట్ల అమ్మకాలు
♦ వసూలు చేయాల్సిన ఫీజు రూ.22 వేలే
♦ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో కళాశాలల ఇష్టారాజ్యం
♦ కన్వీనర్ కోటాపైనా అనుమానం
♦ ఆందోళనలో అభ్యర్థులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) ప్రవేశాల్లో కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్య కోటా సీట్ల మాటున ప్రైవేటు కళాశాలలు దండుకుంటున్నాయి. ఒక్కో సీటుకు రూ. లక్షన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఈడీ కళాశాలలు తక్కువగా ఉండటం.. ఎంఈడీకి డిమాండ్ ఉండటం యాజమాన్యాలకు కలిసొచ్చింది. దీని ఆసరా చేసుకుని సీట్లకు వేలం పెడుతున్నట్లు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా వారు మౌనం పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

ఓయూతోపాటు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ వర్సిటీల పరిధిలో ఏడు ఎంఈడీ కళాశాలలు ఉండగా.. వాటిలో సీట్లు 350 మాత్రమే. వీటికోసం మూడు వేల పైచిలుకు ఎంఈడీ ర్యాంకర్లు పోటీపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో సీటుకు ఏడాదికి రూ. 22 వేలకు మించి వ సూలు చేయకూడదు. అయితే కన్వీనర్ కోటాలో సీటు దక్కని అభ్యర్థులంతా మేనేజ్‌మెంట్ సీట్లపై దృష్టి సారించారు. దీన్ని ఆసరాగా చేసుకొని రెండేళ్ల ఎంఈడీ కోర్సుకు సీటుకు రూ. లక్షన్నర చొప్పున వసూలు చేస్తున్నాయి.

 ఆది నుంచి అనుమానాలే!
 ఓయూసెట్‌కు సంబంధించిన దాదాపు అన్ని కోర్సుల ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి వెబ్  కౌన్సెలింగ్ నిర్వహించారు. వీటితో పోలిస్తే ఎంఈడీ కౌన్సెలింగ్ ఆలస్యంగా చేపట్టారు. గత నెల నుంచి రెండు దశలుగా జరిగిన ఎంఈడీ కౌన్సెలింగ్‌ను ఆన్‌లైన్లో కాకుండా సాధారణ పద్ధతిలో చేపట్టారు.  అధికారులు ఒక్క ఎంఈడీకే మాన్యువల్ కౌన్సెలింగ్ ఎంచుకున్నప్పటి  నుంచే అనుమానాలు మొదలయ్యాయి. కళాశాలల వారీగా సీట్ల వివరాలనూ వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. దీంతో వర్సిటీ పరిధిలో ఎన్ని కళాశాలలు, ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. కౌన్సెలింగ్ చేపట్టిన ఓయూ అడ్మిషన్స్ డెరైక్టర్ కార్యాలయం వద్దనే కళాశాలల జాబితాను కౌన్సెలింగ్ జరిగిన రోజున ప్రదర్శించారు. అదీ స్పష్టంగా, సీట్ల వారీగా వివరాలను ఇవ్వలేదు.

 కొందరికే కౌన్సెలింగ్
 ర్యాంకులు కేటాయించిన ప్రతి అభ్యర్థిని కౌన్సెలింగ్‌కు పిలవాలి. కానీ ఎంఈడీ సబ్జెక్టులో దాదాపు 3 వేలకు పైగా అభ్యర్థులకు ర్యాంకులు ఇచ్చినా కొద్దిమందినే కౌన్సెలింగ్‌కు పిలిచారు. తుది దశ కౌన్సెలింగ్‌లోనూ ఇదే తంతు. కౌన్సెలింగ్‌కు కూడా పిలవకుండా అధికారులే తమ అవకాశాలను దెబ్బతీయడమేంటని అభ్యర్థులు వాపోయారు. ఈ వ్యవహారంపై ప్రవేశాల డెరైక్టర్ గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. ‘సీట్లు కొద్దిగానే ఉన్నాయి. ఏ కేటగిరీలో ఏ ర్యాంకు వరకు సీటు వస్తుందన్న అంచనాలు మాకు తెలుసు. అందుకే అన్ని ర్యాంకుల వారిని కౌన్సెలింగ్‌కు పిలవలేదు. కొద్దిమందినే పిలిచాం’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement