ఎంసెట్-17ను పటిష్టంగా నిర్వహించాలి
ఎంసెట్-17ను పటిష్టంగా నిర్వహించాలి
Published Thu, Apr 20 2017 10:23 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
ఏలూరు సిటీ : ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-17 ఆన్‌లైన్ పరీక్షలను అత్యంత పటిష్టవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ నీట్ పరీక్షా ప్రశ్నపత్రాలను ఏలూరు పరీక్షా కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గతేడాది తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కావటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలోని ఎంసెట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రంలో తొలిసారి ఆన్‌లైన్‌లో ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారని, విద్యార్థుల్లోని భయాన్ని, ఆందోళనను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ ఆన్‌లైన్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలకు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర, జిల్లాస్థాయి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కె.క్రాంతిబాబు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన మోడల్ నీట్ పరీక్షకు 5 డివిజన్లలలో 12 పరీక్షా కేంద్రాల్లో 900 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్ మేకా అమరావతి, అధ్యాపకులు సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆర్.మోహన్ ఉన్నారు.
Advertisement
Advertisement