విద్యారంగంపై చిన్నచూపు తగదు.. | Education department under suppression | Sakshi
Sakshi News home page

విద్యారంగంపై చిన్నచూపు తగదు..

Published Sat, Dec 10 2016 10:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

విద్యారంగంపై చిన్నచూపు తగదు.. - Sakshi

విద్యారంగంపై చిన్నచూపు తగదు..

*  మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు
 ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు ప్రారంభం
 
తెనాలి అర్బన్‌: ప్రభుత్వ విద్యపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ, పేదలకు విద్యను దూరం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. భారత విద్యార్థి ఫెడరేఫన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) 44వ జిల్లా మహాసభలు తెనాలి మారీసుపేటలోని ఎస్‌సీఆర్‌ఎన్‌ఎంహెచ్‌ స్కూల్‌లో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్‌ కుమార్‌ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎఫ్‌ఐ జండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ప్రవేట్‌ విద్యాసంస్థలకు తక్కువ ధరకు భూములను ప్రభుత్వం కట్టబెడుతోందన్నారు. గురుకులాల పేరుతో హాస్టల్స్‌ను, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో పాఠశాలలను అర్ధంతరంగా ప్రభుత్వం మూసివేస్తోందన్నారు. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఖాళీగా ఉన్న లెక్చరర్, ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.
 
విద్యపై ఆసక్తి పెంచుకోవాలి: అన్నాబత్తుని
మరో ముఖ్యఅతిథి, వైఎస్సార్‌సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ ఫేస్‌బుక్, వాట్సప్, ట్విటర్‌ వంటి వాటి ప్రభావం ఎక్కువగా యువతపై ఉందన్నారు. దీనివల్ల యువతలో ఆలోచించే తత్వం కనుమరుగవుతుందని, ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. విద్యపై ఆసక్తిని పెంచుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.మనోజ్‌కుమార్, వి భగవన్‌దాసు మాట్లాడుతూ తెనాలిలో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఇంటర్, డీగ్రీ కళాశాల లేకపోవటం దారుణమన్నారు. దీనివల్ల డివిజన్‌లోని ప్రజలు తమ పిల్లల్ని రూ.వేలు ఫీజులు చెల్లించి చదివించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ కళాశాల తెనాలికి మంజూరు అయ్యే వరకు పోరాడతామని చెప్పారు. ముందుగా భగత్‌సింగ్, క్యూబా మాజీ అధ్యక్షుడు క్యాస్ట్రో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో ఎన్‌సీఆర్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు వేజళ్ల ఉమామహేశ్వర్, సీఐటీయూ డివిజన్‌ నాయకుడు షేక్‌ హుస్సేన్‌వలి, వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు అగస్టీన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పవన్, జ్యోతి, ప్రసన్న, గోపి, తెనాలి డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఈపూరి వంశీ, హరి, జిల్లా పరిధిలోని నాయకులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement