
అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడవాలి
అనంతపురం రూరల్ : అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థీ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం రూరల్ మండల పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య,వైజ్ఞానిక ప్రదర్శన–2016ను జిల్లా విద్యాధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సునీత మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా సైన్స్ ఫేర్– ఇన్‌స్పేర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నేటి భవిష్యత్ మొత్తం సైన్స్ పైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచ దేశాల మానవాళి అభివృద్ధికి ఉపయోగపడే నూతన నమూనాలను ఆవిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్–2 ఖాజామొహిద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వాన్ని ఆలవర్చుకోవాలన్నారు. అప్పుడే అన్ని రంగాల్లో రాణించే ఆవకాశం ఉందన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ సైన్స్ అంటే మార్కులు కాదన్నారు. ప్రయోగాలు లేని సైన్స్‌లో 100కి 99 మార్కులు వచ్చిన వ్యర్థమేనన్నారు.
జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ పూర్వకాలంలోనే తమకు కావాల్సిన పరికరాలను వారే తయారు చేసుకుని వాడుకునే వారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జిల్లా విద్యాధికారి శామ్యూల్ మాట్లాడుతూ 2011 నుంచి ఇప్పటి వరకు సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిరవధికంగా కొనసాగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 652 ఎగ్జిబిట్లు సైన్స్ ఫేర్‌కు వచ్చాయన్నారు.
విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను గుర్తిస్తూ ఏటా సైన్స్ ఫేర్ ఆవార్డుల పేరుతో నగదు బహుమతులను ప్రభుత్వాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు. విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొని, సైన్స్ ఫేర్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మొహిద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.