♦ 80 మంది నుంచి రూ.2.05 కోట్ల వసూలు
♦ ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
నల్లగొండ క్రైం: ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఎనిమిది మందిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ కూడా ఉన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. సయ్యద్ మహమూద్, కోదాడ మండలం ఎర్రారం గ్రామానికి చెందిన నలజాల కొండల్‌రావు, పారెల్లి వెంకటేశ్వర్లు, కొండా శివయ్య, కాసగాని రమేష్, చెన్నురి శేఖర్‌రెడ్డి, ముడావత్ గోపాల్, దాస్యం నాగరాజు ఓ ముఠాగా ఏర్పడ్డారు.
ఉద్యోగాలిప్పిస్తామని నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 80 మంది నిరుద్యోగుల నుంచి రూ. 2.05 కోట్లు వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కోదాడ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన సయ్యద్ మహమూద్, కొండల్‌రావుల నుంచి రూ.16 లక్షల 50 వేలు, స్కార్పియో, స్కోడా కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు.