మినీ బస్సు బోల్తా
చిల్లకూరు : వారంతా ఏ రోజుకారోజు కూలీ పనులు చేసుకుని పొట్ట పోసుకునేవారు. పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి చేరుకునేందుకు పనిచేస్తున్న కంపెనీ బస్సులో బయలు దేరిన కొద్దిసేపటికే ప్రమాదం బారిన పడి గాయాల పాలయ్యారు. మండలంలోని కమ్మవారిపాళెం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు కోట మండలంలో చిట్టేడులో ఉన్న జీవీఆర్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో చిల్లకూరు, గూడూరు రూరల్ ప్రాంతంలోని మేగనూరుకు చెందిన 23 మంది మహిళలు రోజు వారి పనులకు వెళుతుంటారు. వారంతా పనులు ముగించుకుని పరిశ్రమకు చెందిన మినీ బస్సులో వస్తుండగా మండలంలోని కమ్మవారిపాళెం సమీపంలోకి వచ్చే సరికే కోటకు వెళుతున్న ఓ మోటారు సైకిలిస్టు వేగంగా బస్సు సమీపంలోకి రావడంతో బస్సుడ్రైవర్ భాస్కర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు పక్కకు ఒరిగిపోయి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న కూలీలు ఒకరిపై ఒకరు పడి పోవడంతో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో చిల్లకూరుకు చెందిన నారాయణమ్మకు తీవ్రగాయాలు కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ భాస్కర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. చిల్లకూరుకు చెందిన రమాదేవి, లక్ష్మమ్మ, సుజన, రాజమ్మలతో పాటు, మేగనూరుకు చెందిన యశోదమ్మ, స్రవంతి, వెంకటరమణమ్మ, బుజ్జమ్మ, పద్మమ్మలకు గాయాలు అయ్యాయి. వీరిని గూడూరు, కోటకు చెందిన 108 వాహనాల్లో గూడూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. నారాయణమ్మ, యశోదమ్మ, భాస్కర్‌ను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంకమ్మ తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ
మినీ బస్సు బోల్తాపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సైలు అంకమ్మ, బాబి, సుధాకర్‌తో కలిసి ఆసుపత్రికి చేరకుని ప్రమాద విషయంపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిశ్రమ యజమానులతో మాట్లాడి నెల్లూరులో చికిత్స పొందుతున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.