‘ఈమాల్’ ఆగయా..
-
జిల్లాకు 3వేల ఇంజక్షన్లు
-
వినాయకపురం పీహెచ్‌సీకి వంద..
-
‘సాక్షి’ కథనానికి స్పందన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మలేరియాకు సంబంధించిన ఈమాల్ ఇంజక్షన్లు జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. ‘మలేరియా మందేదయా’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 7వ తేదీన కథనం ప్రచురితమైన విషయం విదితమే. మలేరియా జ్వరం వచ్చిన వారికి ఈమాల్ ఇంజక్షన్ వేయాల్సి ఉంటుందని, వీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో ఏజెన్సీలోని ఆదివాసీలు జ్వరం తగ్గక ఇబ్బందులు పడుతున్నారని, వేరే కిట్స్‌తో చికిత్స చేసినప్పటికీ తగ్గకపోవడం.. మళ్లీ మళ్లీ పీహెచ్‌సీల వెంట తిరగాల్సిన పరిస్థితి రావడంతో.. పీహెచ్‌సీ వైద్యులు చివరకు ఈమాల్ ఇంజక్షన్‌ను బయట కొనుగోలు చేయాలని ప్రిస్కిప్షన్ రాసిస్తున్నారంటూ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు.. ఇక్కడి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 3వేల ఈమాల్ ఇంజక్షన్లు జిల్లాకు పంపించింది. మొదటి విడతగా అవసరమైన 3వేల ఈమాల్ ఇంజక్షన్లను ప్రభుత్వం అందజేసిందని జిల్లా మలేరియా అధికారి అయ్యదేవర రాంబాబు తెలిపారు. ఇవి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో అశ్వారావుపేట మండలం వినాయకపురం పీహెచ్‌సీకి అత్యవసరంగా 100 ఇంజక్షన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.