ఉద్యోగులు త్యాగాలు చేయాలి
మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ బ్యూరో: కొత్తలో ఇబ్బందులుంటాయని, అయినాసరే ఉద్యోగులు త్యాగాలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లయినా ఇక్కడకు రాకపోవడం సరికాదన్నారు. రిస్కు లేకుండా ముందుకెళ్లలేమని, తాను విజయవాడకు వచ్చిన కొత్తలో బస్సులోనే ఉండేవాడినని చెప్పారు. తన భార్య హైదరాబాద్‌లోనే ఉంటున్నా తాను ఇక్కడికి వచ్చానని, ఆమెకు దేశవ్యాప్తంగా వ్యాపారం ఉండడం వల్ల రావడం కుదర్లేదని, వారానికోసారి ఇక్కడకు వస్తోందని తెలిపారు. శనివా రం తన క్యాంపు కార్యాలయంలో ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సెక్రటేరియేట్ కట్టడానికి మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇం దుకోసం ఇంకా రూ. 200 నుంచి రూ. 300 కోట్లు అదనంగా ఖర్చు కానుందన్నారు. ఉద్యోగులను రేయింబవళ్లు పనిచేయిస్తానన్నారు. తాత్కాలిక సచివాలయం ఇంకా సిద్ధం కాలేదు.. సౌకర్యాలు లేవు కదా అని విలేకరులు ప్రశ్నించగా అలాంటి ఇబ్బందులు తప్పవని, తర్వాత అన్నీ సర్దుకుంటాయని తెలిపారు.
దొంగ లెక్కలు రాస్తున్నారు..
ప్రత్యేక హోదాపై తాను రాజీ పడడంలేదని తాను ఢిల్లీకి వెళ్లి అడుక్కోవడానికి కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. నీతి అయోగ్ నివేదికలో స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారని, ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న పది రాష్ట్రాలు ఏస్థాయిలో అభివృద్ధి చెందాయో చూడాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నివేదికలో అందరికంటే వెనుక ఈ రాష్ట్రాలున్నాయని, ప్రత్యేక హోదా వస్తే అన్నీ వచ్చేస్తాయని దొంగ లెక్కలు రాస్తున్నారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం తుపాన్, పదేళ్లలో ఏడేళ్లు కరువు వుందని ప్రధానికి వివరించానని చెబుతూ తమను చూసి తుపాన్ కూడా సముద్రంలో పక్కకు వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. కృష్ణానది నీటిలో మొదటి హక్కు కృష్ణా డెల్టాదేనని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
ఏటా నవనిర్మాణ దీక్ష
జూన్ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో దీక్షను ప్రారంభించి 8న రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రావతరణ అంటూ లేదు కాబట్టి ఈ దీక్షను ఏటా చేస్తామన్నారు.