వికలాంగుడైన స్నేహితుడికి పింఛన్ ఇప్పించాలన్న యువకులు
ఏడాదిగా దరఖాస్తు చేస్తున్నా రాలేదని విన్నపం మొక్కుబడి జవాబుతో నిలదీత
యువకులను తప్పించి ఎమ్మెల్యేకు దారి ఇచ్చిన పోలీసులు
బుచ్చెయ్యపేట : రోడ్డు ప్రమాదంలో క్షత గాత్రుడై కుర్చీకే పరిమితమైన తమ స్నేహితునికి వికలాంగుని పింఛన్ మంజూరు చేయాలని కోరిన యువకులపై చోడవరం ఎమ్మెల్యే రాజు అసహనం వ్యక్తం చేశారు. దీంతో యువకులు ఎమ్మెల్యే తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదపూడి గ్రామానికి చెందిన వియ్యపు సోమునాయుడు లారీ క్లీనర్‌గా పని చేస్తూ, మూడేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చెయ్యి పోగొట్టుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో స్నేహితుల సహాయంతో వైద్యసేవలు పొంది పొట్ట నింపుకుంటున్నాడు.
ఇతనికి మూడేళ్లుగా వికలాంగ పింఛన్ అందజేయాలని ప్రతి గ్రామ సభలోను, జన్మభూమి, రచ్చబండలో సోమునాయుడు దరఖాస్తులు అందజేసినప్పటికీ నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. ఇదే విషయమై ఆదివారం తమ గ్రామం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు కారును సోముడు నాయుడు స్నేహితులు కుంచం సాయిరాం, దుర్గవరపు సతీష్‌కుమార్, గోకివాడ నాయుడు, దేవర కిషోర్, పాతరపల్లి సత్తిబాబు తదితరులు ఆపి సోమునాయుడుకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. పై అధికారులతో మాట్లాడి మంజూరు చేస్తానని ఎమ్మెల్యే మొక్కుబడిగా చెప్పడంతో.. ఇదే మాట ఏడాదిగా చెబుతున్నారని స్నేహితులు అన్నారు.
సోమునాయుడు కన్నా వెనుక దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ల మంజూరు కాగా, తమ స్నేహితుడికి నేటికీ మంజూరు కాలేదని చెప్పడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. కనీసం వికలాంగుడిపై జాలి చూపకుండా, కారు కూడా దిగకుండా ఆగ్రహంగా సమాధానం చెప్పడంతో యువకులు మండిపడ్డారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని కారుకు అడ్డుగా నిలిచారు. పోలీసులు ఆ యువకులను చెదరగొట్టి కారుకు దారి ఇచ్చారు. కారులో ఉన్న మండల నాయకులు ఎమ్మెల్యేకు వత్తాసు పలకడంతో యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.