‘ఆంగ్లా’నికి కట్టు‘బడి’..
♦ ‘సక్సెస్’తో కొత్త ఒరవడి
♦ ఆంగ్ల మాధ్యమానికి ఆహ్వానం
♦ బడుల రక్షణకు సర్కార్ యత్నాలు
పాపన్నపేట: ఆంగ్ల మాధ్యమానికి పెరుగుతున్న ఆదరణను అనుకూలంగా మలుచుకుని సర్కార్ బడులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2016-17 విద్యా సంవత్సరంలో ఆసక్తిగల హెచ్‌ఎంలు, ఎస్‌ఎంసీలు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పాఠశాల విద్యా సంచాలకులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సక్సెస్ స్కూళ్లు సత్ఫలితాలు ఇస్తుండటంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. జిల్లాలో సుమారు 2,900 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 168 సక్సెస్ పాఠశాలలు ఏర్పాటుచేసి, ఆంగ్ల మాద్యమంలో బోధన గావించారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో సక్సెస్ పాఠశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి.
అదనపు సౌకర్యాలు వద్దంటేనే..
ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో అదనపు సౌకర్యాలు కోరకుండా ఉంటే.. అక్కడ ఆంగ్ల మాద్యమాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏ పాఠశాలలో అయితే ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటుచేయాలనుకున్నారో.. అక్కడ అదనపు గదులు, అదనపు టీచర్లు, అదనపు ఫర్నిచర్ కోరకూడదనే షరతును విధించారు. అలాంటి పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీల తీర్మానంలను జతచేసి ఆంగ్లమాధ్యమానికై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు కొంతమంది ప్రధానోపాధ్యాయులు తమ సంసిద్ధతను తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రి ప్రైమరీ తరగతులుంటే సత్ఫలితాలు:
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రి ప్రైమరీ తరగతులుంటే మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ బడులను కాపాడుకోవచ్చునని హెచ్‌ఎంలు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి ఏర్పడిన నేటి తరుణంలో సామాన్యులు సైతం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. అయితే మూడేళ్ల వయసులోనే నర్సరీలో చేరే చిన్నారులు 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేరలేక అదే పాఠశాలలో తమ చదువులు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు నమోదు చేసుకునే అవకాశం లేనందున రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమంలో ప్రిప్రైమరీ వ్యవస్థను ఏర్పాటుచేస్తే బడులు మూతపడకుండా ఉంటాయని అంటున్నారు. ప్రజలు ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో చుక్కలన్నంటే ఫీజులు చెల్లించలేక అప్పులపాలవుతున్నారు. కనుక ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉపయోగించుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.