తెలుగు.. కనుమరుగు
► మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం
► ఉత్తర్వులు జారీ
► పాఠ్యపుస్తకాలు మంజూరు
► ఒకేమారు అమలుతో ఇబ్బందులు
ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాల. ఇందులో 600 మంది బాలికలు చదువుతున్నారు. వీరిలో 300 మంది ఆంగ్ల మాధ్యమం, మరో 300 మంది తెలుగు మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. మారిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది నుంచి మొత్తం 600 మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదవాల్సి ఉంది. ఈ ప్రభావం విద్యార్థినులపై పడనుంది. దీంతో వీరు నష్టపోయే అవకాశం ఉంది.
ప్రొద్దుటూరు: మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే 14, 27 జీఓలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఏడాది నుంచే ఈ విధానం ప్రారంభం కాగా, ఇందుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మున్సిపల్ పాఠశాలల్లో ఇక తెలుగు మాధ్యమం కనుమరగైనట్లే.
చాలా రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన కొనసాగుతుండగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులు తమకు కావాల్సిన మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం లేదు. తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమంలోనే తమ చదువును కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో గత ఏడాది వరకు తెలుగు మాధ్యమం చదివిన వారికి ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు పేర్కొంటున్నారు.
కడప, ప్రొద్దుటూరులో..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాకు సంబంధించి కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ పరిధిల్లో మున్సిపల్ పాఠశాలలు నడుస్తున్నాయి. జిల్లాలో మరో ఏడు నగర పంచాయతీలు ఉన్నా వీటి పరిధిలోని పాఠశాలలు మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల పరిధిలో నడుస్తున్నాయి. ఈ ప్రకారం కడప కార్పొరేషన్ పరిధిలో 43 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత, ఏడు ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 30 ప్రాథమిక, 9 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
వీటిల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభమైంది. ఈనెల 14న మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్‌లో కూడా ఆంగ్లమాధ్యం కొనసాగుతుందని చెప్పారు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందనే అభిప్రాయాన్ని ప్రధానోపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ స్కూళ్లలో లాగా ఒకటో తరగతి నుంచి ఒక్కో ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. 2007 ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూల్ విధానాన్ని ప్రారంభించారు. ఈ ప్రకారం తొలి ఏడాది ఆరు, మరుసటి సంవత్సరం ఏడు ఇలా వరుసగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తూ వచ్చారు.
ఆంగ్లమాధ్యమంలోనే బోధన
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన సాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. – చంద్రమౌళీశ్వరరెడ్డి, కడప కార్పొరేషన్ కమిషనర్.
మార్పులు ఉంటే తెలియజేస్తాం
గతంలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగుతోంది. ఏవైనా మార్పులు ఉంటే మళ్లీ తెలియజేస్తాం. – శేషన్న, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్.
తెలుగు మాధ్యమం కావాలని అడిగాం
గత ఏడాది మున్సిపల్ అధికారులు ఎస్‌ఎంసీల ద్వారా ఆంగ్ల మాధ్యమంపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఆంగ్లమాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమం ఉండాలని తెలియజేశారు.తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే మారు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మున్సిపల్ పాఠశాలల్లో ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. ఒకే మారు చెప్పడానికి ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. - డీవీ రవీంద్రుడు, యూటీఎఫ్ పట్టణాధ్యక్షుడు.