ఇంగ్లిష్‌ మీడియం జీవోలు రద్దు | AP High Court verdict on English Medium | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ మీడియం జీవోలు రద్దు

Published Thu, Apr 16 2020 4:27 AM | Last Updated on Thu, Apr 16 2020 4:27 AM

AP High Court verdict on English Medium - Sakshi

సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమంది. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత చూసినా.. 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, విద్యా జాతీయ విధానం, ఇతర నివేదికల మేరకు నిస్సందేహంగా 1 నుంచి 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నాయని హైకోర్టు తెలిపింది. అందువల్ల ఈ జీవోలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కావని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం 92 పేజీల తీర్పు వెలువరించింది. 

ఇంగ్లిష్‌ మీడియం జీవోలను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలివీ..
► ప్రాంతీయ, మాతృ భాషగా తెలుగుకు ఓ పెద్ద చరిత్రే ఉంది. స్వాతంత్య్రం తర్వాత తెలుగు భాషాభివృద్ధి కోసం ఓ కమిటీ ఏర్పాటైంది. దీని ఫలితంగానే ‘అధికార తెలుగు భాషా సంఘం, తెలుగు అకాడమి’ ఆవిర్భవించాయి. దీని సిఫారసుల మేరకే ప్రాథమిక, ఉన్నత విద్యలో తెలుగు బోధనా మాధ్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సహేతుక కారణాలు లేకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఓ జీవో ద్వారా ఈ విధానాన్ని మార్చింది. 
► మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా హక్కు చట్ట నిబంధనలను సంతృప్తి పరచలేరు. పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అభ్యర్థన మేరకు ఇంగ్లిష్‌ మీడియంను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్న విషయాన్ని చట్ట ప్రకారం తల్లిదండ్రుల కమిటీలు నిర్ణయించజాలవు.
► 81, 85 జీవోలు జారీ చేసే నాటికి రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలకు సమాంతరంగా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు నడుస్తున్నాయి. తద్వారా ఇంగ్లిష్‌ మీడియంలో తమ పిల్లలను చేర్చాలనుకునే వారికి ఆ అవకాశం ఉంది. కాబట్టి  ఇంగ్లిష్‌ మీడియంను తప్పనిసరి చేశామన్న ప్రభుత్వ వాదన ఆమోదయోగ్యం కాదు. 

కేసు పూర్వాపరాలు
విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌ 20న జీవో 85 (అంతకు ముందు 81) జారీ చేసింది. 
► ఈ జీవోను సవాలు చేస్తూ పశ్చిమ గోదావరికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్, తూర్పు గోదావరికి చెందిన సుధీష్‌ రాంభొట్ల హైకోర్టులో వేర్వేరుగా గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 
► ఈ వ్యాజ్యాల్లో తల్లిదండ్రుల కమిటీలు కూడా ఇంప్లీడ్‌ అయ్యాయి. అన్ని వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపి ఈ ఏడాది ఫిబ్రవరి 14న తీర్పు వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement