సొసైటీలో కుంభకోణంపై విచారణకు ఆదేశం
Published Tue, Jan 31 2017 2:22 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో) : ఆచంట మండలం వల్లూరు సహకార సొసైటీలో అవినీతి కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా సహకార అధికారి లూథర్‌ను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వల్లూరుకు చెందిన రాములు కలెక్టర్‌కు ఫోన్ చేసి సొసైటీలో నిధులు దుర్వినియోగమయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకుని సొసైటీని రక్షించాలని కోరాడు. కలెక్టరేట్‌లో విధులు నిర్వహించి రిటైర్ అయిన సాంబశివరావు అనే ఉద్యోగి తనకు పెన్షన్ బెనిఫిట్స్ ఇంకా అందలేదని ఫిర్యాదు చేయగా జిల్లా రెవెన్యూ అధికారిని కలవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement