రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్‌’ | Enraged 'yallow batch' | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్‌’

Published Mon, Apr 10 2017 11:32 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్‌’ - Sakshi

రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్‌’

  •  ఉరవకొండలో బరి తెగించిన టీడీపీ నేతలు
  •  అరాచకాలు చేస్తున్న ఆ ‘ఐదుగురు’
  •  గోవింద్‌ కనుసన్నల్లో నిత్యం సెటిల్‌మెంట్లు
  • అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యం
  • కంప్యూటర్‌ ఆపరేటర్‌ రామలింగం ఆత్మహత్య నేపథ్యంలో వెలుగులోకి వాస్తవాలు
  • ఓ స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని రామలింగంతో యథేచ్ఛగా పనులు
  •   నిబంధనలకు విరుద్ధంగా పని చేయలేక ఆత్మహత్య!
  •  

     తహసీల్దార్‌ కార్యాలయ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రామలింగం ఆత్మహత్య వెనుక పెద్ద కుట్ర దాగుందా? ఓ స్థలం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు అతన్ని బ్లాక్‌మెయిల్‌ చేసి.. యథేచ్ఛగా అక్రమాల పర్వాన్ని సాగించారా? ఉరవకొండలో ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా కొల్లగొడుతున్నా, నిత్యం సెటిల్‌మెంట్లు సాగిస్తున్నా అధికార యంత్రాంగం ‘జీహుజూర్‌’ అనడం మినహా అడ్డుకట్ట వేయలేకపోయిందా? కొంతమంది అధికారులు కూడా టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారా?... ఉరవకొండలో కొంతకాలంగా సాగుతున్న వ్యవహారాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది.

                       ఉరవకొండలో అధికార పార్టీకి చెందిన ఐదుగురు టీడీపీ నేతల బృందం అరాచకశక్తిగా మారింది. ఈ బ్యాచ్‌లో లత్తవరం మాజీ సర్పంచ్‌ గోవింద్‌ కీలకమని తెలుస్తోంది. ఉరవకొండతో పాటు చుట్టుపక్కల భూదందాలు, సెటిల్‌మెంట్లు, ఇతర పంచాయితీలు ఏవైనా వీరి దృష్టికి వస్తే క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ‘వ్యవహారాన్ని చక్కబెడతాం..మీకింత- మాకింత’ అని రేటు కుదుర్చుకుంటారు. అధికార పార్టీని, అధికారులను అడ్డుపెట్టుకుని సెటిల్‌మెంట్లు చేస్తారు. వీరి దందాను ఎవరైనా ప్రశ్నిస్తే నోట్లకట్టలతో మభ్యపెడతారు. దారికి రానివారిని తమదైన శైలిలో భయపెడతారు. ఇదే తరహాలోనే కంప్యూటర్‌ ఆపరేటర్‌ రామలింగాన్ని కూడా బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట రామలింగం షేక్షాన్‌పల్లిలో తన భార్య పేరుతో ఐదెకరాల పొలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలిసింది. దీన్ని టీడీపీ నేత గోవింద్‌ పసిగట్టారు. రామలింగంతో చర్చించారు. తాను చెప్పిన పనులు చేస్తే ఐదెకరాల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతానని, లేదంటే విలేకరులకు చెబుతానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీంతో రామలింగం భయపడి సరెండర్‌ అయిపోయాడు. అతన్ని అడ్డుపెట్టుకుని గోవింద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ముష్టూరు సమీపంలోని ఓ ప్రభుత్వ స్థలంపై గోవింద్‌బ్యాచ్‌ కన్ను పడింది. అందులో ప్లాట్లు వేసి విక్రయించాలని భావించారు. డీసీల్యాండ్‌గా ఉన్న ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ అయ్యేలా మరో సర్వే నంబర్‌కు మార్చి అడంగల్‌లో పొందుపరచాలని ఒత్తిడి తెచ్చారు. అతను అలాగే చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వీరి ఒత్తిడితో  తహసీల్దార్‌ కార్యాలయంలో చాలా వ్యవహారాలు చేసినట్లు సమాచారం. అయినా వారు వదలకపోవడంతో  ఇలాంటి పనులు మరిన్ని చేయలేక ఆత్మహత్యకు తెగించినట్లు తెలిసింది.

     

    ఉరవకొండ బ్యాచ్‌ దందాల్లో కొన్ని

    – ఉరవకొండలోని సర్వే నంబర్‌ -127లో కొంత భూమిని స్వాతంత్య్ర సమరయోధునికి ఇచ్చారు. దీన్ని ‘పచ్చబ్యాచ్‌’ సర్వే నంబర్‌ 102–ఏగా మార్చి తొమ్మిది మందికి విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనూ రామలింగాన్ని గోవింద్‌ వాడుకున్నట్లు సమాచారం.

    – ఎక్కడైనా లేఅవుట్‌ వేసేముందు 30 శాతం స్థలాన్ని పంచాయతీకి వదలాలి. ఉరవకొండలో ఇలా వదిలిన ఓ విలువైన స్థలంపై ‘బ్యాచ్‌’ కన్నుపడింది. దాన్ని తాము తీసుకుని బదులుగా మరోచోట  ఇస్తామని ‘ఎక్సే‍్ఛంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌’ కింద పంచాయతీకి లేఖ రాశారు. ఉరవకొండ టీడీపీ సర్పంచ్‌ నర్రా సుజాత భర్త కేశన్న కూడా ఇందులో చేయి కలిపినట్లు తెలుస్తోంది. దీంతో ‘ఎక్సే‍్ఛంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌’కు పంచాయతీ ఒప్పుకుంటూ తీర్మానం కూడా చేసినట్లు సమాచారం.

    – ఉరవకొండలో రోడ్డు విస్తరణకు ముందు చికెన్‌ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం వాటిని తొలగించారు. వీటి వెనుక ఓ వృద్ధురాలు ఇల్లు ఉంది. విస్తరణ తర్వాత ఆమె ఇల్లు మెయిన్‌రోడ్డుపైకి వచ్చింది. దీనిపై గోవింద్‌ కన్నుపడింది. ఎమ్మార్పీఎస్‌ నాయకుడి పేరుతో ఈ స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించి నెలకిందట ఆమెను ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ స్థలం గవిమఠానికి సంబంధించినది.

    – గవిమఠానికి సంబంధించి 50 సెంట్ల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు డాక్యుమెంట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మఠం ఏజెంట్‌ రాజన్న కూడా చేతులు కలిపినట్లు సమాచారం. ఈ స్థలం ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ కూడా అయిపోయిందని ఓ వర్గం చెబుతోంది.

    – ఉరవకొండలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన రూ.1.60 కోట్లు విలువచేసే స్థలం వివాదంలో ఉంది. ఈ కుటుంబం అప్పుల్లో ఉంది. స్థలం విక్రయించి బాకీలు చెల్లించాలని రుణదాతలు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గోవింద్‌ జోక్యం చేసుకుని.. స్థలాన్ని ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి విక్రయించేలా చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇతనికీ భారీగానే ముట్టినట్లు వినికిడి.

    – ఉరవకొండ టవర్‌క్లాక్‌ సమీపంలోని ఓ కాంప్లెక్స్‌ వ్యవహారంలోనూ పంచాయితీ చేసి భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది.

    – ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వెనుక ఓ బావి ఉండేది. కాలక్రమంలో దాన్ని పూడ్చేశారు. ప్రభుత్వ స్థలమైన దీన్ని కూడా మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలుస్తోంది. 

               వీటితో పాటు వెలుగులోకి రాని ఎన్నో దందాలు గోవింద్‌ అండ్‌ కో ఖాతాలో ఉన్నాయని ఉరవకొండలో చర్చించుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా తమ పని కాలేదంటే ఎమ్మెల్పీ పయ్యావుల కేశవ్‌కు చెప్పి బదిలీ చేయిస్తా అంటూ  బెదిరింపులకు దిగుతారని తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన వెంకటేశ్‌ హత్య కేసులో ఓ టీడీపీ మండలాధ్యక్షుడు, ఓ లాయర్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉందని పట్టణం మొత్తం కోడై కూసింది. ఈ కేసులో నిందితుల పేర్లను పూర్తిగా మార్చేలా గోవింద్‌ పోలీసులను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. సివిల్‌ పంచాయితీలకు సంబంధించి ఎవరైనా దారికి రాకపోతే ఈ బ్యాచ్‌ పోలీసులను ఆశ్రయిస్తుంది. పోలీసులు వారిని తీసుకొచ్చి బెదిరించి ఈ బ్యాచ్‌కే అండగా నిలుస్తారన్న విమర్శలున్నాయి. ఉరవకొండలో ఈ స్థాయిలో అధికార పార్టీ అరాచకాలు నడుస్తోంటే సామాన్యుల ఆస్తులకు ఏమేరకు భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘పచ్చ బ్యాచ్‌’ ఆగడాలపై  ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలని ఉరవకొండ ప్రజానీకం విన్నవిస్తోంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement