చిరు వ్యాపారి ఆత్మహత్య
ఉరవకొండ : పట్టణంలోని పార్కు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నివాసముంటున్న కార్తీక్ (26) అనే చిరువ్యాపారి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ మగ్బూల్ తెలిపిన కథనం మేరకు.. కార్తీక్‌కు కళ్యాణదుర్గానికి చెందిన వాణితో మూడు నెలల క్రితం వివాహమైంది. మిక్చర్, చకోడీల వ్యాపారం చేసుకునే కార్తీక్‌కు వ్యాపార అభివృద్ధి కోసం అప్పు దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం ఇంట్లోనే పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.