
కొత్తగా ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా ఆస్పత్రులు, డిస్పెన్సరీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. కేంద్రమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మంగళవారం ఈఎస్‌ఐ కార్పొరేషన్ రీజనల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్మికశాఖలో జవాబుదారీతనం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఏడాది కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు.
కార్మికుల పీఎఫ్‌కు అధిక వడ్డీ వచ్చేలా దేశ చరిత్రలో ఎవరూ సాహసించని షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు.అదే విధంగా చెల్లింపులు జరగని (అన్‌క్లైమ్) పీఎఫ్ నిధులు రూ.27 వేల కోట్లు ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. పీఎఫ్‌కు సంబంధించి యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్) తీసుకురావడం గొప్ప విజయమన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని బీడీ కార్మికుల పిల్లల స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని లక్షా 20 వేల మందికి గాను రూ.13 కోట్ల 99 లక్షలు విడుదల చేశామన్నారు. కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కుల సమీకరణ వల్లే బిహార్‌లో ఓడిపోయాం..
బిహార్ శాసనసభ ఎన్నికల్లో కుల సమీకరణ వల్లే బీజేపీ ఓటమి పాలయిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. మూడు పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడినప్పటికీ బీజేపీ 50 స్థానాల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు.