తగ్గిన రబీ సాగు
సీజన్ ముగుస్తున్నా పెరగని విస్తీర్ణం
రుణాలు అందక.. అప్పులు పుట్టక..
నోట్ల రద్దు, గిట్టుబాటు కాని ధరలు
మంచిర్యాల అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు.. వ్యవసాయ రుణాలు అందక.. సాగుకు అప్పులు పుట్టక జిల్లాలో యాసంగి సాగు(రబీ) అంచనాలు తారుమారయ్యాయి. సాగు సీజన్ ఆరంభంలో సాధారణ సాగు విస్తీర్ణం 22 వేల హెక్టార్లుగా అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు ఏడు వేల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.వెయ్యి, రూ.500 రద్దు చేసినప్పటి నుంచీ బ్యాంకర్లు రబీ సాగుకు రుణాలు అం దించడం లేదు. నగదు కొరత కారణంగా రైతులకు ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఇవ్వడం లేదు. దీంతోపాటు జిల్లాలో సెప్టెంబర్ అనంతరం వర్షం చినుకు లేకుండా పోయింది. యాసంగి సాగు సమయంలో ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఓ మోస్తరు వర్షాలు పడుతుండేవి. దీంతో నీటి సౌకర్యం లేని వరికోతల అనంతరం ఇతర పంటలు సాగు చేసేవారు. కాని ఈ ఏడాది ఆ సమయంలో వర్షాలు కురవలేదు. ఆరుతడి పంటగా సాగు చేసుకునే శనగ సాగు విస్తీర్ణం సైతం తగ్గిపోయింది. దీంతో వ్యవసాయ శాఖ అంచనా తలకిందులైంది. సాధారణ సాగు ప్రణాళికను మరోమారు సవరించి 13,325 హెక్టార్లకు కుదించారు. ఏటా యాసంగి సాగు అక్టోబర్ నుంచి మొదలువుతుంది. నవంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో పంటలు విత్తుకుంటారు. కాని జనవరి ముగింపు దశకు వచ్చినా పంట విత్తుకోవడం పూర్తి కాలేదు. జిల్లాలో ప్రధానంగా సాగువుతున్న పంటల్లో వరి పంటనే ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో కురిసిన వర్షాలతో జలశయాలు నిండుకున్నా వరి సాగు చివరి ఆయకట్టు వరకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. కడెం, ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వలకు కింద అరుతడి పంటలకే అది కూడా వారబందీ ప్రకారం నీటి విడుదల చేస్తుండడంతో అన్నదాతలు వరి సాగుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం వరి నాట్లు బోరుబావులు నాన్ అయకట్టు ప్రాంతాల్లో మాత్రమే పూర్తయ్యాయి.
అందని రుణాలు..
ఖరీఫ్ సీజన్‌లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. యాసంగి సీజన్ ఆశాజనకంగా ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు రైతుల్లో పెద్ద ఎత్తున ఆశలకు ఊపిరి పోసింది. చెరువులు, కుంటలన్నీ ఎక్కడికక్కడా నీటితో కళకళలాడుతున్నాయి. బోరుబావుల్లోనూ నీటిమట్టం అమాంతం పైకి పెరిగింది. ఈ యాసంగి కాలం ఢోకా లేదని రైతలంతా అనుకున్నా.. బ్యాంకు అధికారుల తీరుతో ఆశలు అడియాసలవుతున్నాయి. పాత రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో వెలుగు చూసిన పరిణామాలతో ఆగమయ్యారు. బ్యాంకుల్లో రుణాలు పురుద్ధరించుకోలేక, మరోవైపు కొత్త రుణాలు పుట్టకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వానకాలం సీజన్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకున్నా బ్యాంకులు, వ్యాపారుల నుంచి డబ్బులు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సాగుకు పెట్టుబడులకు ఆర్థిక సహకారం అన్నదే బ్యాంకుల నుంచి లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. రబీ సీజన్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురవాల్సిన వర్షాలు ముఖం చాటేయడంతోపాటు జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తుండడంతో వరి సాగు చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు.
సాగు ప్రణాళికలు తారుమారు
యాసంగిలో పుష్కలమైన వనరులు అందుబాటులో ఉండడంతో వ్యవసాయశాఖ భారీ అంచనాలు పెట్టుకుంది. ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి సాగు ఈ ఏడాది 22 వేల హెక్టార్ల వరకు అవుతుందని అంచనా వేసింది. గత రెండేళ్లు కరువుతో అల్లాడిన రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో కురిసిన వర్షాలతో సాగు విస్తీర్ణం పెరుగుతుందని ప్రణాళిక రూపొందించింది. కాని పెద్ద నోట్ల రద్దు, ఖరీఫ్ పండించిన ధాన్యం అమ్ముకుంటే చేతికి నగదు అందక, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రబీ సాగుకు వెనకడగు వెస్తున్నారు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాలే తారుమారు అవుతున్నాయి. సాగు జనవరి నెల చివరి వరకు 90 శాతం పూర్తి కావాల్సి ఉంది. కాని 50 శాతం కూడా లేదు.
అంచనాలు తారుమారు
Published Mon, Jan 23 2017 10:05 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement