
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
డీపీఓ అరుణ
శామీర్‌పేట్: ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని డీపీఓ అరుణ అన్నారు. ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమాల గురించి తెలుసుకుని మాట్లాడారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మండలంలోని 8 గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, సిబ్బంది డీపీఓను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, ఎంపీడీఓ జ్యోతి, ఈఓపీఆర్డీ శ్రీనివాస్ గుప్త, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.