ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్త కావచ్చు
-ఇస్రో మాజీ డైరెక్టర్ సుందరమూర్తి
కాకినాడ: మేధస్సుకు పదునుపెడితే ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్త కావచ్చని ఇస్రో మాజీ డైరెక్టర్ టి.కె.సుందరమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌ఎంటీ ఫంక్షన్‌హాలులో నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల తయారీపై ఆసక్తి కల్పించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపగ్రహాలను రోదసిలోకి పంపే విధానాన్ని స్లైడ్స్ ద్వారా వివరించారు. వీటివల్ల వర్షాభావ పరిస్థితులు, తుపాన్ల బారిన పడే ప్రాంతాలను సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. ఉపగ్రహ సమాచారం మానవాళి ఆర్థికాభివృద్ధికి, ప్రాణరక్షణకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కమిషనర్ ఆలీమ్‌భాషా మాట్లాడుతూ భవిష్యత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. యువశాస్త్రవేత్త సౌరభ్ కౌశల్ మాట్లాడుతూ విద్యార్థులు ఆవిష్కరణలపై మక్కువ చూపిస్తే దేశం త్వరితగతిన సూపర్‌పవర్‌గా ఎదగగలదన్నారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త షాన్‌మోజ్ అంగారక గ్రహ యాత్రపై జరుగుతున్న పరిశోధనలను వివరించారు. నాసా ప్రతినిధి దీపికా దౌలూరి శాస్త్రవేత్తలను పరిచయం చేశారు. డీఆర్‌డీవో మాజీ శాస్త్రవేత్త అందె మురళి మిసైల్స్ తయారీని వివరించారు. యువశాస్త్రవేత్త కె.ఎన్.రావు దేశ పురోభివృద్ధికి పాటుపడతామని ప్రమాణం చేయించారు. శాస్త్రవేత్తలు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. వ్యాలీస్ మెరినరీస్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈవో జయకుమార్, కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె.రమేష్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ జి.సన్యాసిరావు, మేనేజర్ కె.సత్యనారాయణ, స్టేట్‌బ్యాంక్ అధికారి డి.రాంబాబు, లయన్స్‌క్లబ్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ, స్కూల్స్ సూపర్‌వైజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.