- జెడ్పీ సీఈఓ పద్మ
జెడ్పీకి ఏటా రూ.10 కోట్ల ఆదాయం
Published Tue, Aug 30 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
రాయవరం :
వివిధ రిజిస్ట్రేషన్ల ద్వారా జిల్లా పరిషత్‌కు ఏటా రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు జెడ్పీ సీఈవో కె.పద్మ తెలిపారు. రాయవరం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇసుక సీనరేజ్ ద్వారా వచ్చే ఆదాయం ఇప్పుడు రావడం లేదన్నారు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 315 ఊళ్లను ఎంపిక చేసినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు 60 గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే అక్టోబరు 2వ తేదీ నాటికి మరో 100 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 48 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శిథిల భవనాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిలో ఇప్పటికే 21 కూల్చివేసినట్టు తెలిపారు. శిథిల భవనాల కూల్చివేతలో జాప్యం చోటు చేసుకోకుండా మండల స్థాయిలో ఎంపీడీవో, మండల విద్యాశాఖాధికారి, మండల ఇంజనీరింగ్ అధికారి, సంబంధిత పాఠశాల హెచ్‌ఎంతో కూడిన కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. జెడ్పీ పరిధిలో 426 ఉన్నత పాఠశాలలున్నాయన్నారు. వీటిలో 241 ఉన్నత పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయన్నారు. ఇవి నాన్‌టీచింగ్ స్టాఫ్ కొరతను ఎదుర్కొంటున్నాయని, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. అపరిశుభ్రతతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వారం రోజుల పాటు అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డ్రైన్లలో సిల్ట్ తొలగించడం, దోమల నివారణకు మందులు చల్లించడం వంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ఇన్‌చార్జ్ డీపీవోగా జెడ్పీ సీఈవో
బోట్‌క్లబ్ (కాకినాడ) : ఇన్‌చార్జ్ డీపీవోగా, జెడ్పీ సీఈవో కె.పద్మను నియమిస్తూ జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు వణికిస్తున్న తరుణంలో ప్రస్తుత ఇన్‌చార్జ్ డీపీవోగా పనిచేస్తున్న జేవీఎస్‌ఎన్ శర్మ ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం వల్ల ఆయనపై చర్యలు తీసుకొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపం కారణంగా ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్న పంచాయతీ కార్యదర్శులతోను, ఈవోపీఆర్డీలతో సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల శర్మను ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగించినట్టు తెల్సింది. శర్మ అమలాపురం డీఎల్‌పీవోగా పనిచేస్తు కాకినాడ ఇన్‌చార్జ్ డీపీవోగా గత మార్చినెలలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు అవినీతి ఆరోపణలు రావడం కూడా ఆయనను తప్పించడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement