rs.10 crores
-
నష్టాల్లో రాజంపేట ఆర్టీసీ
రాజంపేట: రాజంపేట ఆర్టీసీ డిపో రూ.10.80కోట్ల నష్టానికి చేరుకుంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు సంబంధించి రాజంపేటలో ఆర్టీసీ డిపో ఉంది. కిలోమీటరకు రూ.27.11 ఆదాయం వస్తున్నప్పటికి ఖర్చు రూ.35.78 వస్తోంది. దీన్ని బట్టి కిలోమీటరకు రూ.8.67 నష్టం వస్తోంది. ఈ విధమైన రీతిలో రాజంపేట డిపో ఆర్టీసీ నడుస్తోంది. తెలుగువెలుగుకు ఆటోల తాకిడి..: రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో చాలా ప్రాంతాలకు నడిచే తెలుగువెలుగు బస్సులకు ఆటోల తాకిడి అధికమైంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం క్రమక్రమంగా నైట్‌హాల్ట్ బస్సులతో పాటు కొన్ని బస్సులను రద్దు చేసుకుంది. ఉదాహరణకు తొగురుపేట, నందలూరు ఆర్ఎస్ బస్సులు ఉన్నాయి. మారుమూల గ్రామాలకు ఆటోల తాకిడితో ఈ బస్సులను ఆర్టీసీ నడపడం మానేసింది. తగ్గిపోతున్న సర్వీసులు..: రాజంపేట డిపోలో ఒకప్పుడు 124 సర్వీసులకుపైగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 80కి చేరింది. అద్దెబస్సులు 30 వరకు నడుస్తున్నాయి. నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ యాజమాన్యం బస్సులను ఉపసంహరించుకుంటోంది. సర్వీసులు తగ్గిపోతున్న క్రమంలో ఉన్న కార్మికులకు డ్యూటీ చార్ట్‌లో విధులకన్నా..విశ్రాంతి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కోట్లు విలువచేసే స్థలం ఉన్నా..: డిపోకు కోట్ల రూపాయలు విలువజేసే రెండు ఎకరాలకు పైగా నిరుపయోగంగా ఉంది. ఈ ఆస్తులను వాడకంలోకి తెచ్చి ఆర్టీసీ డిపో లాభాల బాటలో పయనించేందుకు ప్రయత్నాలు సాగించింది. ఖాళీ స్థలంలో సర్వే నిర్వహించి ప్లాట్స్కూడా వేసింది. ఇప్పుడున్న స్థలంలో ఒకే ఒక షాపు మాత్రం ఏర్పాటైంది. మిగిలిన ప్లాట్స్ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కనుమరుగవుతున్న ఎక్స్‌ప్రెస్ సర్వీసులు...: రాజంపేట డిపో పరిధిలో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కననుమరుగవుతున్నాయి. కలెక్షన్ రావ డం లేదనే సాకుతో నెల్లూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలకు నడిచే బస్సులను నిలిపివేశారు. కడప–రాజంపేట పాతబస్టాండు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ సర్వీసును కూడా ఎత్తివేశారు. ప్రస్తుతం కేవలం విజయవాడ, బెంగళూరు, హైదరాబాదుకు నడుస్తున్నాయి. విజయవాడకు అద్దెబస్సును నడిపిస్తున్నారు. 30మంది రాయచోటికి బదిలీ..: రాజంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న 30 మందిని రాయచోటి డిపోకు బదిలీ అయినట్లుగా సమాచారం. ఈ బదిలీకి ప్రధానంగా ఈ డిపోలో సర్వీసులు తగ్గిపోవడమేనని కార్మికవర్గాలు వాపోతున్నాయి. నడుస్తున్న సర్వీసుల కన్నా అధికంగా సిబ్బంది ఉండటం వల్లనే బదిలీకి ఆర్టీసీ ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల ఈడీ కూడా డిపోకు వచ్చి ఆర్టీస్టీ పురోగతికి సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. అధికారులతో చర్చించారు. కేఎంపీఎల్ సాధించడంలో జోన్లో అగ్రస్థానం..: డిపో నష్టాల్లో నడుస్తున్నప్పటికీ కేఎంపీఎల్ సాధించడంలో ఆర్టీసీ జోన్‌లోని అగ్ర స్థానంలో ఉంది. రాజంపేట డిపో మేనేజరుగా ఎంవీకృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకన్నప్పటి నుంచి ఆర్టీసీని లాభాలబాటలో నడిపించాలని విశేష కృషి సలుపుతున్నారు. డిపోలో తొలిసారిగా కెఎంపీఎల్ సాధించడంలో సఫలీకృతులయ్యారు. ఇటీవల డిపో నష్టాలను తగ్గించుకునేందుకు అనేక ఆదాయమార్గాలను అన్వేషించుకుంటున్నారు. ఆర్టీసీ ఆలయాల దర్శనం, ముఖ్యమైన ఉత్సవాలకు బస్సులను నడిపించడంలో కార్మికుల సహకారంతో ముందుకెళుతున్నారు. డిపో నష్టాల్లో నడుస్తోంది..: రాజంపేట డిపో నష్టం పది కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా వస్తోంది. నష్టాల నంచి బయటపడేందుకు కార్మికులు, ఉద్యోగుల సహకారంతో కృషి చేస్తున్నాం. చాలా రూట్లలో కలెక్షన్ రాకపోవడం వల్ల బస్సులను తిప్పలేకపోయే పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. --- ఎంవీ కృష్ణారెడ్డి, మేనేజరు, రాజంపేట డిపో -
నీటి ఎద్దడి నివారణకు రూ.10 కోట్ల మంజూరు
అనంతపురం అర్బన్ : రాబోవు వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం ఈ మేరకు విజయవాడలో ప్రకటించారు. ఈ నిధులతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. -
జెడ్పీకి ఏటా రూ.10 కోట్ల ఆదాయం
జెడ్పీ సీఈఓ పద్మ రాయవరం : వివిధ రిజిస్ట్రేషన్ల ద్వారా జిల్లా పరిషత్‌కు ఏటా రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు జెడ్పీ సీఈవో కె.పద్మ తెలిపారు. రాయవరం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇసుక సీనరేజ్ ద్వారా వచ్చే ఆదాయం ఇప్పుడు రావడం లేదన్నారు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 315 ఊళ్లను ఎంపిక చేసినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు 60 గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే అక్టోబరు 2వ తేదీ నాటికి మరో 100 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 48 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శిథిల భవనాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిలో ఇప్పటికే 21 కూల్చివేసినట్టు తెలిపారు. శిథిల భవనాల కూల్చివేతలో జాప్యం చోటు చేసుకోకుండా మండల స్థాయిలో ఎంపీడీవో, మండల విద్యాశాఖాధికారి, మండల ఇంజనీరింగ్ అధికారి, సంబంధిత పాఠశాల హెచ్ఎంతో కూడిన కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. జెడ్పీ పరిధిలో 426 ఉన్నత పాఠశాలలున్నాయన్నారు. వీటిలో 241 ఉన్నత పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయన్నారు. ఇవి నాన్‌టీచింగ్ స్టాఫ్ కొరతను ఎదుర్కొంటున్నాయని, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. అపరిశుభ్రతతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వారం రోజుల పాటు అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డ్రైన్లలో సిల్ట్ తొలగించడం, దోమల నివారణకు మందులు చల్లించడం వంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇన్చార్జ్ డీపీవోగా జెడ్పీ సీఈవో బోట్‌క్లబ్ (కాకినాడ) : ఇన్చార్జ్ డీపీవోగా, జెడ్పీ సీఈవో కె.పద్మను నియమిస్తూ జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు వణికిస్తున్న తరుణంలో ప్రస్తుత ఇన్చార్జ్ డీపీవోగా పనిచేస్తున్న జేవీఎస్‌ఎన్ శర్మ ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం వల్ల ఆయనపై చర్యలు తీసుకొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపం కారణంగా ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్న పంచాయతీ కార్యదర్శులతోను, ఈవోపీఆర్డీలతో సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల శర్మను ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగించినట్టు తెల్సింది. శర్మ అమలాపురం డీఎల్పీవోగా పనిచేస్తు కాకినాడ ఇన్చార్జ్ డీపీవోగా గత మార్చినెలలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు అవినీతి ఆరోపణలు రావడం కూడా ఆయనను తప్పించడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు టోపీ!
నేరేడ్మెట్ (హైదరాబాద్) : చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం పేరుతో నగరంలోని నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన ఓ మహిళ రూ.10కోట్ల మేర మోసం చేసి ఉడాయించింది. దీనికి సంబంధించి సుమారు 50 మంది బాధితులు ఆదివారం నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణారెడ్డి అనే మహిళ, ఆమె భర్త రఘునాథరెడ్డి డిఫెన్స్ కాలనీలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు. చిట్టీ పాడుకున్న వారికి నగదు ఇవ్వకుండా 3 రూపాయల వడ్డీ ఆశ చూపి వారి దగ్గరే ఉంచుకునేవారు. ఇలా సుమారు 100 మందికి రూ.10కోట్ల మేర వారు బకాయిపడ్డారు. వారికి నగదు చెల్లింపులు చేయకుండా గత సోమవారం అరుణారెడ్డి, ఆమె భర్త, కుమార్తె ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బాధితులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫోన్‌నంబర్లు పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.