‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
చింతలమానెపల్లి : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని, వాటిని కాపాడడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అటవీశాఖ కోర్సిని బీట్ అధికారి ప్రభాకర్ అన్నారు. బాబాపూర్ గ్రామపంచాయతీలోని లంబాడిహేటిలో అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం నివారించాలంటే అడవులను పెంచాలన్నారు. అటవీ జంతువులను వేటాడడానికి పలుచోట్ల ఉచ్చులు బిగించారని వీటికారణంగా మనుషులు చనిపోతున్నారన్నారు.
అటవీ జంతువుల కారణంగా పంటలు నష్టపోయినా, ఆస్థులు నష్టపోయినా సమాచారం అందిస్తే వాటికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అడవులను నాశనం చేయడం, వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, చట్టాలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.