కార్పొరేషన్‌ను లూటీ చేస్తున్నారు | ex mp fires mla and mayor | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ను లూటీ చేస్తున్నారు

Published Fri, Jan 27 2017 11:56 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

కార్పొరేషన్‌ను లూటీ చేస్తున్నారు - Sakshi

కార్పొరేషన్‌ను లూటీ చేస్తున్నారు

నగరపాలక సంస్థలో గడిచిన రెండున్నరేళ్లలో ప్రజాప్రతినిధులు ప్రజాధనాన్ని విచ్ఛలవిడిగా లూటీ చేశారు.

– పైప్‌లైన్‌ పనుల్లో అవినీతి కన్పించలేదా?
– ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌పై మాజీ ఎంపీ ‘అనంత’ ఫైర్‌
– బందిపోటు దొంగలను మించిపోయారు : మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి  ధ్వజం
 – సెంట్రల్‌ విజిలెన్స్‌తో విచారణ చేపట్టాలి  : సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌


అనంతపురం న్యూసిటీ : ‘నగరపాలక సంస్థలో గడిచిన రెండున్నరేళ్లలో ప్రజాప్రతినిధులు  ప్రజాధనాన్ని విచ్ఛలవిడిగా లూటీ చేశారు. నగరంలో అభివృద్ధి పనులకు టెండర్‌ వేయాలంటే ప్రజాప్రతినిధులకు కప్పం కట్టాల్సి వస్తుందనే భయంతో కాంట్రాక్టర్లు ఉన్నారు.  నగర ప్రజలు, వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు బిక్కుబిక్కుమంటూ జీవించే భయానక వాతావరణాన్ని పాలకులు సృష్టిస్తున్నారు. ఇక్కడి అవినీతిని రూపుమాపేందుకే ధర్నా చేస్తున్నాం. ఇకనైనా మీరు మేల్కోండి. లేదంటే మీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి నియంత్రిస్తామని’ మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.

మాజీ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరుశురాం, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ తదితరులు హాజరై పాలకవర్గం అవినీతిపై నిప్పులు చెరిగారు.   మాజీ ఎంపీ అనంత మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూప తీరును తప్పుబట్టారు. ‘అధికార పార్టీ నేతల తీరుతో ప్రజలు విరక్తి చెందారు. మేము ఆరోపణలు చేయడానికి రాలేదు. పాలకర్గం అవినీతిని ఎత్తిచూపడానికే నిజాయితీ, నిర్భయంగా «ముందుకొచ్చాం. సీఎం, మంత్రుల పర్యటన పేరుతో చెత్తను ఊడ్చే దగ్గర నుంచి ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారు. ట్రాఫిక్‌ పేరుతో రోడ్లు విస్తరించాలని ఒకరు, విస్తరించకూడదని మరొకరు మాట్లాడుతున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలేదు.

వర్గాలుగా ఏర్పడి భయానక వాతావరణం సృష్టించారు.ఎప్పుడు ఎవరిని కొడతారో తెలియని పరిస్థితి. ఓ ప్రజాప్రతినిధి ‘చైతన్యం’ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. వీరికి ఎవరిచ్చారీ హక్కు’ అని ప్రశ్నించారు. రూ.147 కోట్లతో చేపడుతున్న పైప్‌లైన్‌ పనుల్లో అవినీతి జరుగుతుంటే ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌కు కనపడలేదా అని ప్రశ్నించారు. టెండర్లలో లెస్‌కు వేసిన వారిని కాదని ఎక్సెస్‌(అంచనా కంటే అధిక మొత్తం)కు కోట్‌ చేసిన ఐహెచ్‌పీ కంపెనీకి పైప్‌లైన్‌ పనులు కట్టబెట్టారన్నారు. పైప్‌లను సరిగా పూడ్చకున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అవినీతిపై జిల్లా కలెక్టర్‌ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అనంతపురంలో తహశీల్దార్, నగర పాలక సంస్థ కమిషనర్‌, ధర్మవరం, కంబదూరులో రెవెన్యూ అధికారులపై అధికార పార్టీ నేతల దాడులు హేయమన్నారు. వారి అవినీతి, దౌర్జన్యాలు మితిమీరాయని,  ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

బందిపోట్లను మించిపోయారు
‘నగరపాలక సంస్థలో డిపార్ట్‌మెంట్, నామినేషన్, పూడికతీత, మట్టిదిబ్బల తొలగింపు పనుల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. బందిపోటు దొంగలను మించి దోచుకుంటున్నారని’ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే, మేయర్, అధికారులు ప్రజాధనాన్ని దిగమింగుతున్నారన్నారు. రూ.కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కాలువలు, డివైడర్లు తొలగించి మళ్లీ వేస్తున్నారన్నారు. మాజీ ఎంపీ అనంత నిధులతో చేసిన పనులకు కూడా బిల్లులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి.. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహాత్మాగాంధీ తరహాలో శాంతివచనాలు వల్లించడం శోచనీయమన్నారు. రుద్రంపేటలో జంట హత్యలు చేసింది ఎమ్మెల్యే అనుచరులేనని ఆరోపించారు.

ఇంట్లోనే మర్డర్లు చేసి రైలు పట్టాలపై శవాలను తేల్చిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు.  ఎమ్మెల్యే చుట్టూ రౌడీలు, గూండాలే ఉన్నారన్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే శిల్పారామం పనులను ఆపి, తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించిందెవరని ప్రశ్నించారు. కార్పొరేషన్‌ అవినీతిపై విజిలెన్స్, కలెక్టర్‌కు లేఖ రాశామని కథలు చెబుతున్నారన్నారు. కలెక్టర్‌ వద్దన్నా కమిషనర్‌.. ఈఈ స్థాయిలో బిల్లులు ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. కలెక్టర్‌ మాటలను వినకుండా బిల్లులు చేశారంటే ఇందులో కలెక్టర్‌కూ భాగస్వామ్యం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఎస్‌ఈకి కమిషనర్‌(ఎఫ్‌ఏసీ)గా బాధ్యత అప్పగించకుండా ఆయన కింద ఉండే ఈఈకి ఏవిధంగా ఇస్తారన్నారు. మిస్సమ్మ స్థలాన్ని కబ్జా చేశామని చెప్పడం సరికాదని, ఇలాగే మాట్లాడితే నాలుక కోస్తామని ఎమ్మెల్యేను హెచ్చరించారు. సంఘమిత్ర స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టింది నీవు కాదా అని నిలదీశారు. మిస్సమ్మ స్థలం కబ్జా చేసి ఉంటే ఎనిమిదేళ్లలో  ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకోకూడదన్నారు. నీతి, నిజాయితీతో పైకొచ్చామని, అందుకే ప్రజలు ఐదుసార్లు తమకు అవకాశం ఇచ్చారని చెప్పారు.

అవినీతి సొమ్మును రికవరీ చేయించాలి
 నగరపాలక సంస్థలో వివిధ అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి సొమ్మును రికవరీ చేయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే, మేయర్‌కు సిగ్గుంటే సెంట్రల్‌ విజిలెన్స్‌తో విచారణ జరిపించాలన్నారు. అప్పుడు నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు.  డ్రామాలు చేస్తున్నారని మేయర్‌ అనడం సరికాదని, తక్షణం ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కడియం నుంచి మొక్కలు తెచ్చామని, సప్తగిరి సర్కిల్‌ నుంచి సూర్యనగర్‌ సర్కిల్‌ వరకు మట్టిని తొలగించామంటూ రూ.8.5 లక్షలు, కేటీఆర్‌ ఫంక‌్షన్‌హాల్‌ నుంచి సోములదొడ్డి వరకు మట్టి దిబ్బల తొలగింపు పేరిట రూ.3.50 లక్షలు బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేశారన్నారు.

గడిచిన ఎనిమిది నెలల్లో కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే రూ 1.5 కోట్ల నామినేషన్‌ పనులు చేశారన్నారు. రూ.కోట్లలో ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఇందులో పెద్ద మనుషుల హస్తం ఉందని ఆరోపించారు.  ధర్నాలో మాజీ మేయర్‌ రాగే పరుశురాం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామి రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీమ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోయ సుశీలమ్మ, కొండమ్మ, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నగరాధ్యక్షుడు దాదాగాంధీ, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, పార్టీ నాయకుడు గోపాల్‌, సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement