తెలుగులో పరీక్ష .. ఆంగ్ల పదాలు | exam in telugu words in english | Sakshi
Sakshi News home page

తెలుగులో పరీక్ష .. ఆంగ్ల పదాలు

Published Sun, Apr 3 2016 3:51 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

తెలుగులో పరీక్ష .. ఆంగ్ల పదాలు - Sakshi

తెలుగులో పరీక్ష .. ఆంగ్ల పదాలు

బిక్కమొగం వేసిన బీఎస్సీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు
విద్యార్థులుఏఎన్‌యులో విపరీత ధోరణులు
విద్యార్థులుడిక్షనరీల బాట పట్టిన అధ్యాపకులు
పది మార్కుల ప్రశ్న అవుటాఫ్ సిలబస్

 ఒంగోలు: పరీక్షల నిర్వహణలో నాగార్జున యూనివర్శిటీ అధ్యాపకుల  వింత ధోరణితో విద్యార్థులకు దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. శనివారం బిఎస్సీ ప్రథ మ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్ రెండో సెమిస్టర్ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్శటీ నిర్వహించింది. ప్రశ్నను తెలుగు అక్షరాలలో లిఖిస్తూ ఆంగ్ల పదాలను వినియోగించారు. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పరీక్ష హాల్లో విద్యార్థులు బిక్కమొహం వేయడంతోపాటు బయటకు వచ్చిన తరువాత సమస్యను అధ్యాపకులకు వివరించారు. దీంతో వారు తెలుగు మీడియం విద్యార్థులకు ప్రశ్నలను ఇంగ్లిష్ పదజాలం ఉపయోగించడంపై దిగ్భ్రాంతికి గురయ్యారు. మరికొన్నిచోట్ల  ఏకంగా ఫిజిక్స్ పాఠ్యాంశాల్లోని తెలుగు పదజాలం వాడారు.

అధ్యాపకులనే అయోమయంలో పడేసే రీతిలో ప్రశ్నలను కూర్చడం ఆచార్య నాగార్జున యూనివర్శిటీ కొనసాగుతున్న వింత ధోరణికి నిదర్శనంగా మారుతుందని అధ్యాపకులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీనికారణంగా ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులే అధికంగా నష్టపోతారనేది జగమెరిగిన సత్యం. సెక్షన్ -బిలో పదిమార్కుల ప్రశ్న అవుటాఫ్ సిలబస్ అని అధ్యాపకులు పేర్కొంటున్నారు. విద్యార్థులు నష్టపోకుండా యూనివర్శిటీ అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

 దిగ్భ్రాంతి : అధ్యాపకులు సైతం వీటిని అర్థం చేసుకోవడానికి డిక్షనరీలను పరిశీలించాల్సి వచ్చిందంటే పరీక్ష హాల్లో విద్యార్థులు ఏమాత్రం సమాధానాలు రాసి ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కేవలం విద్యార్థుల సహనాన్ని పరీక్షించడంతోబాటు తెలుగు భాషపై విద్యార్థుల పట్టును పరిశీలించేదిగాను, విద్యార్థులకు ఆంగ్లభాషా పదాలకు తెలుగు ట్రాన్స్‌లేషన్ చేయగలరా లేదా అనేది పరిశీలిస్తున్నట్లుగా పరీక్ష సాగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించాలి తప్ప సహనాన్ని కాదని, పరోక్షంగా ప్రశ్న అడిగినా అది పాఠ్యాంశంలో తమకు తెలిసిన పదజాలం కాకపోవడం వల్లే తాము పరీక్షను సరిగా రాయలేకపోయామంటూ విద్యార్థులు పేర్కొంటుండడం గమనార్హం.

 సమస్యల చిట్టా ..

సెక్షన్ ఏలో ఒకటవ ప్రశ్న, సెక్షన్ బిలో 9(ఎ) ప్రశ్నలో సాధారణ హార్మోనిక్ డోలనం అని ఇచ్చారు. తెలుగులో సరళ హరాత్మక డోలనం అని ఉంటుంది.

రెండో ప్రశ్న తేలికపాటి డోలనాలు అని ఇచ్చారు. తెలుగు మీడియం పాఠ్యపుస్తకంలో అవరుద్ధ డోలనాలు అని ఉంది. తేలికపాటి, అవరుద్ధ పర్యాయపదాలు అవుతాయా.. కాదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

4వ ప్రశ్నలో సిరీస్ అని ఇచ్చారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇది శ్రేణిగా పరిచయం.

5వ ప్రశ్న అతిస్వరాలు , అనుస్వరాలు అని ఉండాలి. కాని అనుస్వరాలు బదులుగా స్వరాత్మకాలు అని ఇచ్చారు. అనుస్వరాలు , స్వరాత్మకాలు పర్యాయపదాలు అవుతాయా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం..

6వ ప్రశ్నలో రేఖాంశకంపనాలు అని ఇచ్చారు. కాని తెలుగు మీడియం విద్యార్థులకు అనుదైర్ఘ్య తరంగ రీతులుగా మాత్రమే తెలుసు.

7వ ప్రశ్నకు అతిదైర్ఘ్య ధ్వనులు అని అడిగారు. కాని అతిధ్వనులుగా మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులకు అతిధ్వనులు గురించి మాత్రమే తెలుసు. అతిధ్వనులు,. అతిదైర్ఘ్య ధ్వనులు ఒకటా , కాదా అనేది తెలియక బిక్కమొహం వేశారు.

సెక్షన్ బిలో 9(ఎ) ప్రశ్న నిర్థేశిత సిలబస్‌లోనే లేదని, ఇది పది మార్కుల ప్రశ్నగా ప్రశ్నాపత్రంలో వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

9(బిలో అవరుద్ద హార్మోనిక్ ఓసిలేటర్ యొక్క నాణ్యత కారకం అని ఇచ్చారు. ఇందులో హార్మోనిక్ ఓసిలేటర్ అనేవి ఆంగ్ల పదాలు. తెలుగులో అవరుద్ద హరాత్మక డోలకం యొక్క గుణకారకం అని ఉండాలి

10 (ఎ)లో  నడిచే హార్మోనిక్ ఓసిలేటర్ అని పేర్కొన్నారు. కానీ దాని స్థానంలో బలాత్కృత హరాత్మక డోలకం అని ఉండాలి

10(బి)లో త్రిభుజాకార తరంగ సిద్ధాంతం అని ఉంటుంది. దీనిని ముక్కోణపు వేవ్ అని పేర్కొనడంతో విద్యార్థులకు సమస్యగా మారింది

11(ఎ)లో ఒక వర్గ తరంగం యొక్క విశ్లేషణ కోసం ఫోరియర్ సిరీస్ అనువర్తనాన్ని చర్చించండని పేర్కొన్నారు. కాని వాస్తవంగా చతురస్రాకార తరంగం యొక్క విశ్లేషణ అంటనే విద్యార్థులకు అవగతం అవుతుంది.

12(ఎ)లో ఒక బార్ యొక్క తిర్యక్ కంపన పౌనఃపున్యాలు అని పేర్కొన్నారు. కాని తెలుగులో ఒక కడ్డీ యొక్క తిర్యక్ కంపనాల పౌనఃపున్యాలంటే విద్యార్థులు ప్రశ్నను సులభంగా రాసి ఉండేవారు. 12 (భి)లో కూడా కడ్డీకి బదులుగా బార్ అని పేర్కొనడం జరిగింది.

12 బిలోని రెండో ప్రశ్నలో స్థిరస్వేచ్చగా ఉండే పట్టీ విలోమ కంపనం అని పేర్కొన్నారు. ఇక్కడ కూడా పట్టీ బదులుగా కడ్డీ అని ఉండి ఉంటే విద్యార్థులు సమాధానం రాసి ఉండేవారు.

13(ఎ)లో అల్ట్రాసోనిక్‌పై ఒక వ్యాసం రాసి దాని ఉపయోగాలు తెలపండన్నారు. కాని తెలుగు మీడియం విద్యార్థులకు అల్ట్రాసోనిక్ బదులుగా అతిధ్వనులు అని ఉంటుంది.

13(బి)లో అతిధ్వని తరంగాల ఉత్పత్తి యొక్క ఏవైనా రెండు పద్ధతులు పేర్కొంటూ అల్ట్రాసోనిక్స్ యొక్క అనువర్తనాలను చర్చించమని ప్రశ్న ఇచ్చారు. కాని ఇక్కడ అతిదైర్ఘ్య తరంగాల స్థానంలో అతిధ్వని తరంగాలని, అల్ట్రాసోనిక్స్ స్థానంలో అతిధ్వనులు అని ఉండాలని అధ్యాపకులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement