నేర్పని అక్షరానికి ‘పరీక్ష’ ! | exam the illeterate | Sakshi
Sakshi News home page

నేర్పని అక్షరానికి ‘పరీక్ష’ !

Published Thu, Aug 18 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

నేర్పని అక్షరానికి ‘పరీక్ష’ !

నేర్పని అక్షరానికి ‘పరీక్ష’ !

  • ప్రేరక్‌లు లేరు....అక్షరాలు దిద్దేవాళ్లు లేరు...
  • వీసీవోలకు పనిలేదు...ఎంసీవోలకు సహకారం లేదు
  • గతంలో అక్షరాలు దిద్దిన వారితోనే పరీక్ష రాయించేందుకు సిద్ధమవుతున్న సాక్షరతా భారత్‌
  • రాష్ట్ర వ్యాప్తంగా 21న 5.3 లక్షల మందికి అక్షరాస్యత పరీక్షకు అధికారుల సిద్దం
  • రూ.కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్న వైనం
  • వయోజన విద్యలో లీలలపై ప్రత్యేక కథనం
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : అ అంటే అభివృద్ధే కాదు....అక్షరాస్యత కూడా. నిరక్షరాస్యతలోనూ అగ్రభాగాన ఉన్న తెలంగాణలో అక్షరాస్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం వందల కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ అవన్నీ పక్కదారి పడుతున్నాయనడానికి ఈనెల 21న నిర్వహించబోయే సాక్షరతా భారత్‌ పరీక్షే నిదర్శనం. ప్రేరక్‌లు లేరు...అక్షరాలు దిద్దించలేదు.  కనీసం నిరక్షరాస్యుల పేర్లు కూడా నమోదు చేయలేదు. కానీ ఏకంగా పరీక్ష నిర్వహించేందుకు సాక్షరతా భారత్‌ సిద్ధమవుతోంది. ఒక్కరు ఇద్దరు కాదండోయ్‌... రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 5.3 లక్షల మందికి అక్షరాస్యత పరీక్ష నిర్వహించబోతున్నారు. పరీక్ష రాసిన వాళ్లకు ఇక అక్షరాస్యత సర్టిఫికెట్‌ రావడమే తరువాయి. ఇంతకీ పరీక్ష రాసే వాళ్లెవరు? పరీక్ష కేంద్రానికి ఎవరు తీసుకొస్తారు? ఆ అవసరమేముంది? అసలు అధికారులేం చయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
    ఇదీ లక్ష్యం...
    అక్షరాస్యతతో భారతదేశ సగటు 74.04 శాతం. తెలంగాణలో అక్షరాసత్య దేశ సగటు కంటే తక్కువ. 66.46 శాతంతో 32వ స్థానంలో ఉంది. ఇది గమనించిన ప్రభుత్వం రాష్ట్రంలో అక్షరాస్యతను పెంపొందించేందుకు ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అందులో భాగంగా 2010 నుంచి సాక్షర భారత్‌ కార్యక్రమాలను అమలు చేస్తోంది. గ్రామానికి ఇద్దరు చొప్పున వీసీవోలు(గ్రామ సమన్వయ కార్యకర్తలు), మండలానికి ఒకరు చొప్పున ఎంసీవోలు(మండల సమన్వయ కార్యకర్తలు), జిల్లా స్థాయిలో డీఆర్‌పీ(డిస్ట్రిక్ట్‌ రిసోర్స్‌ పర్సన్‌)లను నియమించి అక్షరాస్యత కార్యక్రమాలు చేపడుతోంది.  గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు దిద్దించడంతోపాటు ఏటా రెండుసార్లు (మార్చి–ఆగస్టు) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌)తో పరీక్షలు నిర్వహించి అందులో పాసైన వారికి సర్టిఫికెట్లను కూడా అందజేస్తోంది. అందులో భాగంగా నాటి నుంచి నేటి వరకు 11 సార్లు పరీక్ష నిర్వహించిన వయోజన విద్యాశాఖ అధికారులు ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే  ఇప్పటి వరకు 5.2 లక్షల మందికి పరీక్ష నిర్వహించడం గమనార్హం.
    చదువు చెప్పకుండానే పరీక్ష !
    తాజాగా ఈనెల 21న మళ్లీ పరీక్ష నిర్వహించాలని సాక్షరతా భారత్, ఎన్‌ఐఓస్‌ నిర్వహించాయి. ఈసారి జిల్లాల వారీగా ఎంత మందితో పరీక్ష రాయించాలనేది టార్గెట్‌ విధించారు. అక్షరాస్యతలో వెనుకబడిన ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో లక్షకుపైగా, మిగిలిన జిల్లాల్లో 10 వేల చొప్పున మొత్తం 5.3 లక్షల మందిని పరీక్ష రాయించేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం పరీక్ష రాసే వాళ్లకు ప్రతి ఒక్కరికి ఒక పెన్ను, ప్రశ్నా పత్రం, రవాణా ఛార్జీలతోపాటు పరీక్ష నిర్వహణ, ప్రచార, పేపర్‌ వాల్యుయేషన్‌ ఖర్చులు చెల్లిస్తున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే దాదాపు 5 లక్షల పెన్నులు కొనుగోలు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో ఒక్కో పెన్నుకు రూ.2.55 పైసల చొప్పున 65 వేల పెన్నులు కొనుగోలు చేశారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో ఆ పెన్ను ధర రూపాయిలోపే ఉండటం గమనార్హం. గ్రామానికి ఒక బ్యానర్, ప్రచారం పేరిట పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే ఈ పరీక్ష నిర్వహణ పేరిట రూ.50 లక్షలు ఖర్చు చేయబోతున్నారు. గత ఐదేళ్లలో ఒక్క జిల్లాలోనే ఇందుకోసం రూ.5 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇక సిబ్బంది జీతభత్యాలు, కార్యాలయ నిర్వహణ పేరిట అదనంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.
    అక్షరాలు నేర్చుకునే వారేరి!
    వాస్తవానికి పరీక్షకు ముందే గ్రామాల వారీగా నిరక్షరాస్యులను గుర్తించాలి. వారి పేర్లు నమోదు చేయాలి. ప్రేరక్‌లను నియమించాలి. మార్చి నుంచి వారితో అక్షరాలు దిద్దించాలి. కానీ ఇవేవీ జరగలేదు. కరీంనగర్‌లో అక్షరాస్యత పెంచాలని భావిస్తున్న కలెక్టర్‌ ఈసారి లక్ష మందిని గుర్తించి పరీక్ష రాయించాలని వయోజన విద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) అధికారులను ఆదేశించారు. జిల్లాలో వందలాది స్వశక్తి సంఘాలున్నాయని, అందులో దాదాపు 92 వేల మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నందున వారికి వారితో ఈ పరీక్ష రాయించాలని డీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం స్వశక్తి భవన్‌లో వయోజన విద్య అధికారులు, ఎంసీవోలతోపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎంసీవోలు ‘ఇంతవరకు ప్రేరక్‌లు లేరు. నిరక్షరాస్యల పేర్లు నమోదు చేయలేదు. అక్షరాలు దిద్దించలేదు. పరీక్ష ఎట్లా నిర్వహిస్తాం?’’అని అడగడంతో డీఆర్‌డీవో అధికారి ‘యూజ్‌లెస్‌ ఫెలో...’అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో విస్తుపోయిన ఎంసీవోలు ఆ సమావేశాన్ని బహిస్కరించారు. తిరిగి సదరు అధికారి ‘క్షమాపణ’ కోరడంతో మళ్లీ సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రత్యేకంగా అక్షరాస్యతపై ఫోకస్‌ చేస్తున్నందున ఈసారి ఎలాగోలా సహకరించాలని, గ్రామానికి 50 నుంచి వంద మంది చొప్పున సమీకరించి పరీక్ష రాయించాలని సమావేశంలో నిర్ణయించారు. గతంలో పరీక్ష రాసిన వారు, చదువుకున్న వారిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి రాయించాలని కూడా తీర్మానించినట్లు తెలిసింది. ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల్లోనూ దాదాపు ఇదే జిమ్మిక్కులతో పరీక్ష రాయించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ బాధ్యతనంతా గ్రామస్థాయిలో వీసీవోలు, ఎంసీవోలతోపాటు డీఆర్‌డీఏ క్షేత్రస్థాయి సిబ్బందిపై మోపడంతో అంత మంది తీసుకొచ్చేదెలా? అని తలలు పట్టుకుంటున్నారు. ఇదే అంశంపై వయోజన విద్య ఉప సంచాలకులు జయచంద్రారెడ్డి వివరణ కోరగా...తాము 8 వేల మందిని మాత్రమే పరీక్ష రాయిస్తున్నామని, మిగిలిన 92 వేల మందిని తీసుకొచ్చి పరీక్ష రాయించే బాధ్యత డీఆర్‌డీఏ అధికారులదేనని పేర్కొన్నారు. నిరక్షరాస్యుల పేర్లు నమోదు చేయలేదు...అక్షరాలు నేర్పలేదు కదా..పరీక్ష ఎట్లా రాయిస్తారు? అని అడిగితే అక్కడక్కడా ప్రేరక్‌లను నియమించినట్లున్నారు...అని పేర్కొనడం గమనార్హం.
    జిల్లాల వారీగా పరీక్ష రాసేందుకు నిర్దేశించిన లక్ష్యమిది..
    ఆదిలాబాద్‌ 2,27,000
    కరీంనగర్‌ 1,00,000
    ఖమ్మం 10,000
    మహబూబ్‌నగర్‌ 10,000
    మెదక్‌ 1,10,000
    నల్గొండ 10,000
    నిజామాబాద్‌ 10,000
    రంగారెడ్డి 10,000
    వరంగల్‌ 43,000
    ======
    మొత్తం 5,30,000
    ======

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement