నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులు
సమాజాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. దీంతో ఏ చిన్న అవకాశం చూపినా...ఆశగా నిరుద్యోగులు మోసపోతున్నారు. నిరుద్యోగుల చిరు ఆశను సొమ్ము చేసుకునేందుకు చాలా మంది కేటుగాళ్లు కాపు కాసుకొని ఉంటున్నారు. వీరిని ఎలా మోసం చేయాలో ఆలోచిస్తూ సరికొత్త మోసాలకు తెర తీస్తున్నారు. తాజాగా సరుబుజ్జిలి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిరుద్యోగులకు రక్షణ శాఖ నుంచి ఉద్యోగాలకు ఎంపికైనట్టు నియామక పత్రాలు అందాయి. తీరా చూస్తే ఎంపికైన వారిలో ఏ ఒక్కరూ కనీసం ఆ పోస్టుకు దరఖాస్తు చేసిందిగానీ...ప్రాథమిక ఎంపికలకు హాజరైందీ లేదు. మరి ఎలా ఎంపికయ్యామన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...
సరుబుజ్జిలి : నిరుద్యోగుల ఆశలను కొందరు మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట వారి నెత్తిన కుచ్చుటోపి పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగుల ఆశలను అవకాశంగా తీసుకొని పోస్టు ద్వారా నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందుతున్నాయి. ఉద్యోగ ప్రాథమిక ఎంపికలకు కూడా హాజరు కాని నిరుద్యోగులకు రక్షణ శాఖకు సంబంధించిన నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందాయి. పత్రాలు అందుకున్న వారు వెంటనే 08750495415 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేసి 48 గంటల్లోగా తాము ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబర్లకు ఒక్కో అభ్యర్థి 18,500 రూపాయిలు శిక్షణ æనిమిత్తం చెల్లించాలని తెలియజేస్తున్నారని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఈ కాల్‌లెటర్లు ఇండోటిబిటెన్ బోర్డర్ పోలీస్, డైరెక్టరేట్ అండ్ మేన్‌పవర్ రిక్వైర్‌మెంట్, ఐటీబీపీ క్యాంప్, మెయిన్‌రోడ్, ఉదంపూర్, జమ్ము అండ్ కశ్మీర్, పిన్ నంబర్ 182101 చిరునామాతో తమకు వచ్చాయని పలువురు నిరుద్యోగులు తెలిపారు. గతంలో ఆరు నెలల కిందట జిల్లాలో ఎల్‌ఎన్‌పేట, చింతాడ, పొన్నాంపేట తదితర గ్రామాల్లో కొందరు నిరుద్యోగులకు కాల్ లెటర్లు వచ్చాయి. అప్పట్లో కొందరు డబ్బులు చెల్లించి మోసపోయారు. ఇప్పుడు జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి పూజారి పురుషోత్తమరావుతో పాటు మరికొందరికి ప్రస్తుతం కాల్‌లెటర్లు వచ్చాయి. వీరితో పాటు అలమాజీపేట, రావాడపేట గ్రామాలకు చెందిన కొందరు నిరుద్యోగులకు కాల్‌లెటర్లు వచ్చినట్టు సమాచారం. అసలు, నకిలీలకు తేడా తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసి నకిలీలకు అడ్డుకట్ట వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇదే విషయమై ఎస్‌ఐ వై.రవికుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా నకిలీ కాల్‌లెటర్లు వచ్చిన వెంటనే పోలీసు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలాంటి మోసాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.