కూడేరు : ఏటీఎంల నుంచి నకిలీ రూ.500 నోట్లు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూడేరులో రెండు నకిలీ రూ.500 నోట్లు బుధవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే కూడేరులోని ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రామన్న స్వీట్స్ తీసుకురమ్మని పనిమనిషికి రూ.500 ఇచ్చాడు. ఆమె ఓ బేకరిలో స్వీట్స్ తీసుకున్న రూ.500 నోటు ఇచ్చింది. ఆ నోటు చెల్లదని దుకాణదారుడు తిరస్కరించాడు. నోటును పరిశీలించగా 5 గీతలు ఉబ్బుగాలేవు. నోటుమధ్యలో పచ్చని రంగలో ఆర్‌బీఐ అని లేదు. నోటు కూడా పలుచగా ఉందని హెచ్‌ఎం వివరించారు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం నుంచి మంగళవారం తాను డ్రా చేశానని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా పట్టణంలో మరో వ్యక్తి వద్ద కూడా రూ.500 నకిలీ నోటు బయటపడినట్లు తెలిసింది.