
నకిలీ దందా
ఉట్నూర్ : నకిలీ అటవీ హక్కు పత్రాల తయూరీ దందా బయటపడింది. ఉట్నూర్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం పోలీసులు నకిలీ పత్రాల తయూరీ ముఠాను అరెస్టు చేయడంతో గుట్టు రట్టయింది. గిరిజనుల అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్నేళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు ప్రభుత్వం 2006 నుంచి అటవీ హక్కు పత్రాలు జారీ చేస్తోంది. ఐటీడీఏ ఏకార్యాలయం నుంచి నేరుగా రైతుల పేర్లు ముద్రితం కాని అటవీ హక్కు పత్రాలు బయటకు వెళ్లడం అనుమానాలకు తావిస్తోం ది. ఐటీడీఏలోని సంబంధిత విభాగం అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులుపూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తే ఇప్పటివరకు ఎన్ని నకిలీ అటవీ హక్కు పత్రాలు బయటకు వచ్చాయో తేలుతుంది.
ఉట్నూర్ కేంద్రంగా..
కొన్నేళ్లుగా ఉట్నూర్ కేంద్రంగా సాగుతున్న నకిలీ అటవీ హక్కు పత్రాల దందాను నిర్మల్ జిల్లా పోలీసులు ఛేధించారు. అటవీ హక్కు చట్టం అమలుతో ఐటీడీఏ అప్పట్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల సర్వేకు నియమించిన సర్వేయర్లలో ఒకరైన రాథోడ్ శ్రీనివాస్ ఈ నకిలీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. శ్రీనివాస్ ఒరిజినల్ అటవీ హక్కు పత్రాలను ఐటీడీఏ కార్యాలయం నుంచి బయటకు తెచ్చి వాటిలో కంప్యూటర్ ఆపరేటర్ సాజిత్ సహాయంతో హక్కు పత్రాలు కావాల్సిన వారి పేర్లపై సృష్టించేవాడని గుర్తించారు. రాథోడ్ విలాస్ అనే వ్యక్తి అప్పటి అధికారులు డీఎఫ్‌వో వినోద్‌కుమార్, పీవో ముత్యాలరాజు, కలెక్టర్ అహ్మద్ నదీం, అహ్మద్‌బాబుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. రబ్బర్‌స్టాంప్‌లను గంగాధర్ అనే వ్యక్తి తయూరు చేసి ఇవ్వగా.. లౌడ్యా శ్రీనివాస్ అటవీ హక్కు పత్రాలు కావాల్సిన వారికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడని పోలీసులు పేర్కొన్నారు. నకిలీ అటవీ హక్కు పత్రాలకు ఎకరాలను బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు 36,713 వ్యక్తిగత హక్కు పత్రాలు జారీ
2006 అటవీ హక్కుల చట్టం అమలుతో 56,358 మంది 2,25,569.82 అటవీ భూములకు వ్యక్తిగతంగా అటవీ హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు 37,372 మందిని అర్హులుగా గుర్తించారు. జూలై నెలాఖరు వరకు 36,713 మందికి 1,35,997.85 అటవీ భూములకు హక్కు పత్రాలు జారీ చేశారు. ఇంకా 515 మందికి 1399.21 ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు అందించాల్సి ఉందని అధికారులు తేల్చారు. నకిలీ వ్యవహారం బయటపడడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్ని నకిలీ అటవీ హక్కు పత్రాలు ఉన్నాయో అధికారులు గుర్తించాల్సి ఉంది. ఉట్నూర్ కేంద్రంగా తయూరైన పత్రాలు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, ఉట్నూర్, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, మామడ మండలాల్లో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అధికారుల పాత్రపై అనుమానాలు
నకిలీ దందా గుట్టు రట్టు కావడంతో ఐటీడీఏని అటవీ హక్కుల విభాగంలో విధులు నిర్వర్తించే అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి సహకారం లేకుండా ఒరిజినల్ పత్రాలు ఎలా బయటకు వెళ్తాయనేది మిస్టరీగా మారింది. ఆర్‌ఓఎఫ్‌ఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారుల తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అవినీతి బాగోతం బయటపడుతుందని గిరిజన నాయకులు అంటున్నారు. నకిలీ వ్యవహారం కారణంగా అర్హులైన రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నేరడిగొండ, ఉట్నూర్, మామడ, ఖానాపూర్ మండలాల్లో ఎక్కువగా నకిలీ పత్రాలు జారీ అయినట్లు గుర్తించడంతో ఆయూ మండలాల్లోని గిరిజనులకు జారీ అరుున హక్కుపత్రాలపై విచారణ నిర్వహిస్తారా లేక ఇప్పటివరకు ఐటీడీఏ ద్వారా జారీ అయిన అటవీ హక్కు పత్రాలన్నింటిపైనా విచారణ చేపడుతారా అనేది వేచి చూడాల్సిందే. నకిలీ దందా వెలుగు చూసిన మండలాల్లో అధికారులు అర్హులకు జారీ చేసిన పత్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
అధికారులు జారీ చేసిన పత్రాలు..
మండలం హక్కుపత్రాలు పొందిన వారు విస్తీర్ణం(ఎకరాల్లో)
ఖానాపూర్ 1960 20,070.49
ఉట్నూర్ 2218 14,352.37
నేరడిగొండ 2497 23,289.90
మామడ 803 5860.95