మృతి చెందిన కౌలు రైతు మృతదేహాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె రూరల్: పట్టణంలోని పెట్రోల్ బంకు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలురైతు దూదేకుల హుసేని(54) మరణించాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పట్టణంలోని కరీంబాగ్ కాలనీకి చెందిన దూదేకుల హుసేని వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. ఈ క్రమంలో పంటలకు అవసరమైన రసాయనిక మందుల కొనుగోలు కోసం హుసేని ఆదివారం సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. పెట్రోల్‌బంకు వైపు వెళ్తుండగా కోవెలకుంట్ల మలుపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హుసేనిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మరణించాడు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు.
కాటసాని పరామర్శ..
ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటసాని రామిరెడ్డి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, నాయకులు పెద్దవెంకటరెడ్డి, బాలరాజు, న రసింహరెడ్డి, సురేష్ తదితరులున్నారు.