విత్తనం కోసం బజారుకు పోలేదు!
బోరు బావి, ఎద్దులు, యంత్ర పరికరాలు, హైబ్రిడ్ వంగడాలు, ఎరువులు ఇన్నీ ఉంటేనే వ్యవసాయమనే నష్టాల సంద్రాన్ని దాటలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులువి. కానీ, కేవలం వర్షాధార భూమిలో సేంద్రియ పద్ధతుల్లో సాగుచేస్తున్న చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల సంప్రదాయ మిశ్రమ (కలిపి) పంటలు వినోద అనే మహిళా రైతును విజేతగా నిలిపాయి. వరుస కరువు పరిస్థితుల్లోనూ ఆమె కుటుంబం ఆహార భద్రతకు, ఆదాయ భద్రతకు లోటు లేకుండా.. అప్పుల్లేకుండా సగర్వంగా జీవిస్తున్నది. తోటి మహిళలకే కాదు చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు నడవవలసిన దారిలో ఆమె దీప కళికలా నిలిచింది. ఆహార సార్వభౌమత్వం సాధించుకున్న ఇటువంటి మహిళా రైతులందరికీ జేజేలు పలుకుతూ వినోదను ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఉత్తమ రైతు -2015 పురస్కారంతో సత్కరించింది. ఆమె ప్రసంగపాఠం ఇక్కడ పొందుపరుస్తున్నాం..
నా పేరు వినోద మిదొడ్డి. నాకు 30 ఏండ్లు. పెండ్లి అయ్యి 15 ఏండ్లు అయితుంది. నాకు ముగ్గురు పిల్లలు. ఒక ఆడ బిడ్డ, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నా దగ్గర 3 ఎకరాల భూమి ఉంది. పార్కం లేదు. బోరు, బావి ఏమి కూడా లేవు. ఒట్టి పునాస పంటలే తీస్తా. ఈ భూమిలో కనీసం 25 రకాల పంటలు పండిస్తాను. 4 రకాల జొన్నలు, 3 రకాల తోగాళ్లు, అనుములు, నువ్వులు, గడ్డినువ్వులు, సజ్జలు, కొర్రలు ఇలా 25 రకాలు పండిస్తాను. నేను ఎన్నడూ నా విత్తనం కోసం బజారుకు పోలేదు. నా విత్తనాలు నేనే దాచిపెట్టి దాన్ని మళ్లి నా భూమిలో పెట్టుకుంటా. దీంతో ఎప్పుడు విత్తనాలకు నాకు తిప్పలు లేదు. నా ఇంటిపెంటనే నా చేనుకి ఎరువు. 2-3 ఏండ్ల నుంచి జెర్రెల ఎరువు కూడ ఇంటికాడనే తయారు చేసుకుంటున్న. అది నాచేనుకే వేసుకుంటా.పిడకల ఎరువు, మేకల ఎరువు ఇట్లా వేరే వేరే ఎరువులు వేసుకొని నా భూమి బలం కాపాడుకుంటూ వస్తున్న. నాకెప్పుడూ సర్కారి ఎరువు కొనే అవసరం రాలేదు. నా భూమి బలంగా ఉంది. మట్టి ఆరోగ్యంగా ఉంది. 10 రకాల పంటలు పెడతా. ఇవన్నీంటితోని నా పంటల మీద ఎన్నడు పురుగులు రాలేదు.. రావు కూడ.
ఇట్లా నాకు బయట విత్తనాల అవసరం లేదు. పార్కం నీళ్ల అవసరం లేదు. సర్కారి ఎరువు వద్దు. సర్కారు మందులు అసలే వద్దు. మా కాళ్ల మీద మేము నిలబడి చేసుకునే వ్యవసాయం అంటే ఇదే అని నాకు అనిపిస్తది. ఇటువంటి వ్యవసాయం నేను ఒక్క ఆమెనే కాదు. నా చుట్టు పక్కన ఊర్లలో, మండలాల్లో వేలాది మంది ఆడోళ్లు ఇదే వ్యవసాయం చేస్తున్నారు. అందరుకు చిన్న చిన్న గుడ్డాల 1-2 ఎకరాల భూములు పార్కం లేని పంటలు. అందరూ జొన్నలు, సజ్జలు, కొర్రలు, తొగాళ్లు, అనుములు, నువ్వులు ఇటువంటి పంటలనే పండిస్తారు. బయట బజారు దీన్ని చిన్న చూపు చూస్తే మేము అందరం ఆడోళ్లం కలిసి ఒక మార్కెట్ తయారు చేసుకున్నాము. బయట మార్కెట్ల ఎంత ధర ఉంటుందో దానికన్నా ఎక్కువ ధరకి దీన్ని కొనుక్కొని పట్టణంలో ఉన్న మీ అసోంటోళ్లకు అందజేస్తాం.
ఇప్పుడిప్పుడే మా సర్కారు మన తెలంగాణ - మన వ్యవసాయం అనే ఒక పద్ధతిని ప్రారంభించింది అని విన్నాను. అసలు తెలంగాణ వ్యవసాయం అంటే మన వ్యవసాయం. నీళ్లకు ఆశపడని పంటలు. కరెంటు అవసరం లేని పంటలు. బలం లేని భూముల్లో కూడా పండే పంటలు. బయట వస్తువులకు ఎన్నడు ఎదురు చూడని వ్యవసాయం.
ఈ సంవత్సరంలో వచ్చిన పెద్ద కరువు లోపల కూడా 3 ఎకరాల భూమిలో నా పంటలతోని 2 ల క్షల రూపాయల ఆముదాని వచ్చింది. నా పక్క చేను యాదయ్య తన 3 ఎకరాల చేనులో బిటి పత్తి వేసి 10 వేల రూపాయలు సంపాదన కూడా చేయలేదు. ఈ యాదయ్య ఆసొంటి రైతులే బీటీ పత్తి, అమ్మేటి పంటల వెంబడి పడి ఉరి వేసుకొని చనిపోతున్నారు. తెలంగాణలో సచ్చిన ప్రతి ఒక రైతుది ఇదే కథ. అయితే నా అసొంటి రైతు ఎవ్వరు ఆత్మహత్య చేసుకోలేదు. నా చుట్టుపక్కల మండలాలలో ఒక్క రైతు కూడా ఇప్పడి వరకు ఉరి వేసుకోలేదు. ఈ పెద్దల సభకు నన్ను పిలిచి నాకు మర్యాద చేసినారు. మీకు చాలా ధన్యవాదాలు. అయితే నా మాటని మీరు పెద్దగా చేసి సర్కారోళ్లకి, యూనివర్శిటోళ్లకు అందరికి వినిపించి మా పంటలకు, మా వ్యవసాయానికి పాత విలువ తెస్తేనే మీరు నన్నిక్కడ పిలిచిన దానికి ఒక మతలబు ఉంటది. ఆ పని మీరు చేస్తారని అనుకుంటున్నా. ఆ పని మీరు చేయాలని ప్రార్థిస్తున్నాను.
- మిదొడ్డి వినోద, నాగ్వార్ గ్రామం, రాయికోడ్ మండలం, మెదక్ జిల్లా
(వివరాలకు www.ddsindia.com లో వీడియోలు చూడండి)