రామరాజు దిగుబడులకు రారాజు
♦ పన్నెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం
♦ సేంద్రియ ఎరువుతో మామిడి తోటల పెంపకం
♦ అంతరపంటలుగా మినుము, అలసంద, పప్పుధాన్యాలు
♦ ఎనిమిదేళ్లుగా వ్యవసాయంలో అధిక దిగుబడులు
గతంలో ఏదైనా మొక్కకు పాదుల్లో నీరు పోస్తే నీటిని పీల్చుకునేదికాదు. పల్లంలోకి నీరు జారిపోయేది. ప్రకృతి వ్యవసాయ విధానాలు మొదలుపెట్టినప్పటినుంచి మొక్కలకు ఎంత నీరు పెట్టినా, భారీ వర్షం కురిసినా మొత్తం నీటిని భూమి పీల్చుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ప్రకృతి వ్యవసాయవిధానాలను అనుసరించాను. మొక్కలు బాగా కాపు కాయడం, పురుగులు, తెగుళ్లను తట్టుకోవటం, కాయలు రుచికరంగా ఉండటం గమనించిన తరువాత ప్రకృతి వ్యవసాయ విధానాల మీద నమ్మకం కలిగింది.
ఉన్నత చదవులు చదివి ఉద్యోగం చేసినా జీవితంలో సంతృప్తిలేదు కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన భైరవ రామరాజుకు. వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయాడు. జీవితంలో నిలదొక్కుకోలేకపోయానన్న అసంతృప్తి! వ్యాపారాన్ని వదిలి సొంతభూమిలో వ్యవసాయాన్ని చేపట్టాడు. కొన్నేళ్లపాటు ఆధునిక పద్ధతుల్లో రసాయనిక ఎరువుల సేద్యం చేశాడు. ఎరువుల అధిక వినియోగంతో భూమి సారాన్ని కోల్పోయి పంట దిగుబడి పడిపోయింది. దీంతో ఏంచేయాలో అర్థంకాని పరిస్థితులేర్పడ్డాయి రామరాజుకి. అందుకే రసాయనిక వ్యవసాయాన్ని వదిలిపెట్టి తనకు తోచిన పద్ధతుల్లో సేద్యాన్ని మొదలుపెట్టాడు.
ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సంబంధించిన అన్ని పుస్తకాలను అధ్యయనం చేశాడు. ఆ క్రమంలోనే జపాన్ ప్రకృతి వ్యవసాయ పితామహుడు మసనోబు ఫుకుఒకా ‘గడ్డిపరకతో విప్లవం’ పుస్తకం పరిచయమయ్యింది. తర్వాత పాలేకర్ ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’ పుస్తకాలు రామరాజు ఆలోచనా విధానాన్ని మార్చివేశాయి. వీటితో తన సాగుపద్ధతులకు మెరుగులద్దుకున్నాడు. ఇప్పుడు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ తోటి అన్నదాతలకు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు. తన సాగు అనుభవాలు స్వయంగా ఆయన మాట ల్లోనే...
మాది కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి. మాది ఏడెకరాల వ్యవసాయం. నేను 1981లో డిగ్రీ పూర్తిచేశాను. కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ, అందులో సంతృప్తి లభించలేదు. 1986 లో మా సొంత భూమిలో వ్యవసాయం మొదలుపెట్టాను. వరి మాగాణి భూమిలోను, పాతకాలంలో వేసిన మా మామిడి తోటలోను పేడదిబ్బ ఎరువులను, రసాయనిక ఎరువులను వినియోగించేవాడిని. మాగాణి భూమి ఏడెకరాల్లో 1 1/2 ఎకరం మెరకగా ఉండే మాగాణి భూమిలో వరి నాటి ఆరుతడిగా ఇచ్చినప్పుడు బాగా దుబ్బు చేసి మంచి దిగుబడులు పొందాను. మిగిలిన 5 1/2 ఎకరాల మాగాణి కొంచెం పల్లంగా ఉండటం వల్ల ఆరుతడి పద్ధతిలో సాగు చేయటానికి ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.
దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వచ్చేవి. చెట్లపై పురుగుమందులు వాడకం వల్ల వాటి వాసనలతో చాలా ఇబ్బందిగా ఉండేది. పురుగుమందుల్ని స్ప్రే చేసిన వెంటనే జలుబు చేస్తూ ఉండేది. ఈ పరిస్థితుల్లో మాగాణి భూమిని వదిలి మా ముదురు మామిడి తోటల్లో ప్రయోగాలు మొదలుపెట్టాను. రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎన్నో పుస్తకాలు చదివాను. ఆ క్రమంలోనే 1994లో జపాన్ దేశ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు పుకుఓకా ‘గడ్డి పరకతో విప్లవం’ పుస్తకం చదివాను. ఆ అవగాహనతో ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడం మొదలుపెట్టాను.
అందులో భాగంగానే ముందుగా.. విశాలమైన మా ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్లు, ఆకు కూరలు, కూరగాయ మొక్కలకు, జామ, నిమ్మ మొదలగు చెట్లకు ఎండిన వేప ఆకులు, ఇతర పిచ్చి మొక్కల అవశేషాలతో పాదులను మల్చింగ్ చేశాను. దీంతోపాటు గోబర్ గ్యాస్ స్లర్రీని పాదుల్లో వేసి పరిశీలించటం మొదలుపెట్టాను. క్రమంగా నేలలో సేంద్రియ పదార్థం పెరిగి నేల గుల్ల బారింది. కొబ్బరి చెట్లు మంచి పరిమాణంతో గెలలు వేశాయి. అలాగే ఇతర మొక్కలు కూడా ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడులనిచ్చాయి.
ఈ అనుభవాలతో 2003-04 సంవత్సరంలో ఖాళీగా ఉన్న మా ఎర్ర గరువు భూమిలో మామిడి మొక్కల్ని అధిక సాంద్ర పద్ధతిలో ( మొక్కకు మొక్కకు మధ్యలో 21 అడుగుల దూరం) ఎకరానికి 99 మొక్కల చొప్పున వివిధ పద్ధతులతో నాటాము. ఒక పద్ధతిలో 3్ఠ3్ఠ3 గుంతలు తీసి పూడ్చి వాటిలో మామిడి టెంకలు వేసి అవి మొలకెత్తి మొక్క 2 1/2 అడుగుల ఎత్తు పెరిగిన తరువాత ఆ టెంక మొక్కలకు మంచి కాపు కాసే తల్లి చెట్ల నుంచి సేకరించిన గ్రాఫ్టింగ్ కొమ్మలతో వెనీర్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో (ఇన్‌సీతూ) అంట్లు కట్టించాను. రెండో పద్ధతిలో టెంకలు నారుమడిలో పోసి వచ్చిన మొక్కలను ముందుగా గోతులు తీసి పూడ్చిన చోట వేసి అవి బ్రతికి 2 1/2 అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వాటికి పై విధంగా గ్రాఫ్టింగ్ చేయించాను.
మూడో పద్ధతిలో మొక్కలు చనిపోయిన చోట మా దగ్గర లేని మామిడి రకాల మొక్కల్ని నర్సరీల నుండి తెచ్చి నాటించాను. ఈ విధంగా మొత్తం 30 రకాల మామిడి మొక్కలను ఈ మూడు పద్ధతుల్లో నాటించాను. అంటు మొక్కలు కొద్దిగా పెరిగిన తరువాత మొదటి ఏడాది నుంచి ఉద్యానవనశాఖ అధికారుల సలహాలతో ఫ్రూనింగ్ చేయిస్తున్నాను. ప్రతి మామిడి మొక్క చుట్టూ పాదులలో పంటల అవశేషాలతో మల్చింగ్ చేశాను. మిగిలిన ఖాళీ భూమిలో అంతర పంటగా మినుము, వేరుశనగ, అలసంద, ఉలవ లాంటి పప్పు ధాన్యాల పంటలను పండించాను. మామిడి పాదుల్లో ఉలవ విత్తనాలు చల్లి వచ్చినమొక్కలను అలాగే వదలివేశాను.
విత్తనాలు మామిడి చె ట్లకిందే రాలి మరుసటి ఏడాదికూడా మెలకెత్తాయి. ఉలవమొక్కలు మామిడి మొక్కలకు కావలసిన నత్రజనిని అందిస్తూ సజీవ ఆచ్ఛాదనగా ఉపయోగపడ్డాయి. మామిడి మొక్కలకు నాలుగేళ్ల వయస్సు వచ్చినప్పటినుంచి కొంత భాగంలో (సుమారు 1 ఎకరం) దున్నడం పాదులు చేయడం ఆపి వేశాను. పేడ దిబ్బ ఎరువులు కూడా వేయడం మానేశాను. రసాయనిక ఎరువులు పురుగు, తెగులు మందులు అసలు ఉపయోగించలేదు. పొలంలో పెరిగిన పిచ్చి మొక్కలను కత్తిరించి పాదుల్లో వేయడం మొదలుపెట్టాం. 2008 నుంచి మిగిలిన తోట మొత్తం పై విధంగా చేయటం మొదలుపెట్టాను. గత అనుభవాల మాదిరిగానే మామిడి మొక్కల్లో నేల గుల్లబారటం, సేంద్రియ పదార్థం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగటం మొదలైంది.
పాలేకర్ వ్యవసాయ విధానంలో...
ఇదే సమయంలో ఒక స్నేహితుడి ద్వారా 2007లో సుభాష్ పాలేకర్ గురించి విన్నాను. తిరుపతిలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాలేకర్ వ్యవసాయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నాను. పాలేకర్ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానం నేను లోగడ అనుసరించిన విధానాల మాదిరిగా ఉండి, ఇంకా ఉత్తమంగా తోచింది. పాలేకర్ పుస్తకాలను చదివి పంటలు బాగా పండటానికి కారణాలను అర్థం చేసుకున్నాను.
2008 నుంచి శ్రీ సుభాష్ పాలేకర్ విధానంలో భాగంగా రెండు దేశవాళీ ఆవులను పెంచుతున్నాను. మొత్తం భూమిలో వాలుకు అడ్డంగా చెట్ల వరుసల మధ్య కందకాలు తీసి జీవామృతం, మల్చింగ్, వాప్స విధానాలను నేటి వరకు పాటిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఏటా నేలలో ఎన్నో మార్పుల్ని గమనించాను. నేల గుల్లబారడం, వానపాముల విసర్జితాలతో నల్లగా రవ్వలాంటి సేంద్రియ పదార్థం ఏర్పడటం, నేలను కొద్దిగా తవ్వితే అనేక వానపాములు మన కంటికి కనపడుతున్నాయి. ఈ తోటలో చెట్ల వరుసల మధ్య కందకాలకు రెండు పక్కల అంతర పంటలుగా కొంత భాగంలో కూరగాయలు కూడా పండి ంచాను.
రసాయనిక వ్యవసాయంలో కన్నా తక్కువ కాకుండా ఆరోగ్యమెన రుచికరమైన పంట దిగుబడులను పొందుతున్నాను. మామిడి మొక్కల ఎత్తు పెరగకుండా ప్రతి ఏటా ప్రూనింగ్ చేయడం వల్ల పెనుతుఫానుల సమయంలో చె ట్లు దెబ్బతినటం గానీ, కాయలు రాలడం కానీ జరుగలేదు. కాయకోత కూడా తేలిగ్గా ఉంది. జీవామృతాన్ని చెట్ల మీద ఉపయోగించడం వ ల్ల ప్రతి సంవత్సరం పూత సమయంలో కొన్ని రకాల ఈగలు, తేనెటీగలు పెద్ద తుట్టెలు పెట్టటం వల్ల పరపరాగ సంపర్కం బాగా జరిగి పంటల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. అనేక జాతుల పక్షులు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని నష్టం కలిగించే పురుగులను ఆహారంగా తీసుకుంటున్నాయి.
ఫలితంగా పురుగుల వల్ల కలిగే పంటనష్టం తగ్గిపోయింది. పక్షుల రెట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. తోటలో నీటి సంరక్షణ కోసం 100 ్ఠ 30, 30 ్ఠ 30 అడుగుల వైశాల్యంలో ఆరడుగుల లోతులో రెండు ఇంకుడు గుంతలు తవ్వటం వల్ల భూమిలోకి వర్షం నీరు బాగా ఇంకిపోతుంది. ఫలితంగా చుట్టు పక్కల ఉన్న తోటలు పచ్చదనం పెంచుకోవటం, పనిచేయకుండా ఉన్న పక్క వారి బోరుబావి కూడా తిరిగి పనిచేస్తోంది. చెట్ల కింద మల్చింగ్ చేయడం వల్ల నేల గుల్లబారి గాలికి రాలిన మామిడి కాయలు దెబ్బతినే నిష్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. వర్షపు నీరు నేలలో బాగా ఇంకి మొక్కలకు బెట్ట కాలంలో ఉపయోగపడుతున్నవి. ఈ తోటలో ఫలాలు మామూలు వాటికన్నా ఎక్కువ కాలం నిలువ ఉండి రుచిగా ఉండటం వల్ల తేలిగ్గా వినియోగదారులకు అమ్ముకోగలుగుతున్నాం.
కాబట్టి రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలను నిస్సందేహంగా వారి భూముల్లో అమలు చేయడం వల్ల వారి కుటుంబానికి మిగిలిన మానవాళికి సంపూర్ణ పోషకాలు ఉండే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందిస్తూ మేలు చేసిన వారవుతారంటున్నారు రామరాజు
(94401 06567)