హంద్రీ-నీవా పనులు అడ్డుకున్న రైతులు
వజ్రకరూరు: మండల పరి«ధిలోని పొట్టిపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులను పలువురు రైతులు అడ్డుకున్నారు. కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాల్లో హంద్రీ-నీవామట్టి పడటంతో రైతులు పనులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హంద్రీ-నీవా డీఈలు జగన్మోహన్‌రెడ్డి, కిరణ్ తదితరులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం పరిసరప్రాంతంలో అధికారులు సర్వేకూడా చేయించారు.
ఈ సందర్భంగా రైతులు రవికుమార్, ముత్యాలయ్య, నరసింహారెడ్డి, అంజినయ్య, రుద్రప్ప, తిమ్మప్ప, కరిబసి, సుంకన్న, లింగన్న తదితరులు అధికారులతో మాట్లాడుతూ కాలువ వెడల్పులో భాగంగా జేసీబీలతో మట్టిని తీసి వేస్తుండగా అది పక్కన ఉన్న పొలాల్లోకి పడుతోందన్నారు. పొలాల్లోకి మట్టితో పాటు పెద్దపెద్ద రాళ్లు కూడా పడుతుండటంతో పంటసాగుకు అడ్డంకిగా మారాయన్నారు. దీనిపై డీఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగుచర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడండి : ఎమ్మెల్యే విశ్వ ఆదేశం
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అధికారులకు ఆదేశించారు. పొలాల్లోకి మట్టి పడిన విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సంబంధిత అ«ధికారులతో ఫోన్‌లో మాట్లాడి రైతులకు ఇబ్బందులు చూడాలని ఆదేశించారు.