రైతుల అప్పులను ఒకేసారి చెల్లించాలి
–పాత రుణాలతో సంబంధం లేకుండా కొత్తవి ఇవ్వాలి
– విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్
కోదాడ: రైతలకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాలు మొత్తం అప్పును విడుతల వారీగా కాకుండా వడ్డీతో సహా ఒకేసారి చెల్లించాలని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడలో జరిగిన రైతుభరోసా దీక్షలో పాల్గొన్న ఆయన కొల్లు వెంకటేశ్వర్‌రావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి రుణాలు చెల్లించకపోవడం వల్ల రైతులకు బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులు పుట్టుక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. విద్య, వైద్య, నిత్యావసరాల ధరలు పెరగడం కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమన్నారు. ఇప్పటికీ కేవలం 21 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు అందుతున్నాయన్నారు. తెలంగాణలో రైతులు చెల్లించాల్సిన అప్పులు కేవలం రూ.16 వేల కోట్లేనని.. దానికి డబ్బు లేదంటున్న ప్రభుత్వం ఎవరూ అడగని మిషన్ భగీరథ పథకానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతు నెలంతా కష్టపడితే వచ్చే ఆదాయం కేవలం రూ.2015లు అని అందులో రూ.950 ఇతర పనులకు వెళ్లడం ద్వారా వస్తుందేనన్నారు. జాతీయ స్థాయిలో సగటున ప్రతి రైతుకు రూ.7400 అప్పు ఉంటే తెలంగాణలో మాత్రం రూ. 93,500 ఉందన్నారు. జాతీయ స్థాయిలో 45 శాతం రైతులు అప్పుల్లో ఉంటే తెలంగాణలో 89 శాతం మంది ఉన్నారరని పేర్కొన్నారు. క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి చేయడానికి రైతుకు రూ. 2600 ఖర్చు వస్తుంటే ప్రభుత్వం మాత్రం రూ.1470 మద్దతు ధర ప్రకటించడ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పంటల బీమా పథకంలో కమతాలను యూనిట్ తీసుకున్నప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. పాత అప్పులతో సంబంధంల ఏకుండా రైతులకు కొత్త లోన్లు ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర కాకుండా గిట్టుబాటు రేటు వచ్చే విధంగా చూడాలని, దళారులను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో వక్కంతుల కోటేశ్వర్‌రావు, బాదెరాము, రావెళ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.