croploans
-
డ్రాగన్ ఫ్రూట్: ఎకరానికి 6.61 లక్షల రుణం..
సాక్షి, హైదరాబాద్: చాలా కొద్దిస్థాయిలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇవ్వాలని రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 500 ఎకరాల్లోనే సాగు చేస్తున్న ఈ పంటను ప్రోత్సహించేందుకు ఎకరానికి ఏకంగా రూ.6.61 లక్షల రుణం ఇవ్వాలని తీర్మానించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ పంటకు రూ. 4.25 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో వివిధ పంటలకు ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలపై టెస్కాబ్ ఉత్తర్వులు జారీ చేసింది. సాగుఖర్చు, ఉత్పాదకత, నీటివసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. గతేడాదితో చూస్తే ఈసారి పెద్దగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరగలేదని టెస్కాబ్ వర్గాలు తెలిపాయి. గతేడాది మాదిరిగానే వరికి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.34 వేల నుంచి రూ.38 వేల వరకు ఫైనాన్స్ ఖరారు చేశారు. మొక్కజొన్న పంటకు రెండు సీజన్లకు కలిపి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు, సాగునీటి వనరులు లేనిచోట రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వనున్నారు. కందులకు సాగునీటి వనరులు ఉన్నచోట రూ.17 వేల నుంచి రూ.20 వేలకు, సాగునీటి వసతి లేనిచోట రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖరారు చేశారు. కంది ఆర్గానిక్ పంటలకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు నిర్ధారించారు. పత్తికి రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు, పత్తి విత్తనోత్పత్తికి రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలు ఖరారు చేశారు. మిర్చికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు, పందిరి కూరగాయల సాగుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు. పసుపుకు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు, ఖర్జూరం సాగుకు రూ.3.9 లక్షల నుంచి రూ.4 లక్షలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను నిర్ధారణ చేశారు. పూర్వ జిల్లాల ప్రకారం ఒక్కో జిల్లాలో ఒక్కరకంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఆ ప్రకారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని టెస్కాబ్ తెలిపింది. పరిమితి పెంచకపోవడంపై విమర్శలు.. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే వరి, కంది, పత్తి వంటి పంటలకు రుణ పరిమితి ఈసారి పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏటా రైతులకు సాగు ఖర్చులు పెరుగుతుంటే, పంట రుణ పరిమితి పెంచట్లేదని పేర్కొంటున్నారు. నిర్ధారించిన మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు వంతున ఖరారు చేసింది. సేంద్రియ కూరగాయలు సాగు చేస్తే ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో ఈసారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతాయని టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి. టమాటకు ఊరట..! టమాటాకు ఈసారి రుణ పరిమితి పెంచారు. సాగునీటి కింద వేసే టమాటాకు రూ.45 వేల నుంచి రూ.48 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మిద్దె తోటలకు మొదటి దశలో రూ.9,500 నుంచి రూ.10,500, రెండో దశలో రూ.19 వేల నుంచి రూ.21 వేలు, మూడో దశలో రూ.28,500 నుంచి రూ.31,500 ఇస్తారు. గతేడాది కంటే కొంచెం పెంచారు. మెడికల్, అరోమాటిక్ ప్లాంట్స్‌కు రూ.37,500 నుంచి రూ.42,500 ఇస్తారు. ఉల్లిగడ్డకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు, పుచ్చకాయకు రూ.27 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. ఇక పశుసంవర్థక, మత్స్య రంగంలో యూనిట్ల వారీగా రుణ పరిమితులు ఖరారు చేశారు. 20 గొర్రెలు ఒక పొట్టెలును కొనుగోలు చేసుకునేందుకు రూ.1.1 లక్షల నుంచి రూ.1.2 లక్షలు ఖరారు చేశారు. పందుల పెంపకానికి యూనిట్‌కు (3+1) రూ.43 వేలు నిర్ధారించారు. ఇక పౌల్ట్రీ ఫామ్ పెడితే బ్రాయిలర్‌కు ఒక బర్డ్‌కు రూ.150, లేయర్స్‌కు అయితే రూ.310 ఇస్తారు. డెయిరీకి ఒక పాడి ఆవు లేదా బర్రె తీసుకునేందుకు రూ.21 వేల నుంచి రూ.23 వేలు రుణం నిర్ణయించారు. రెండున్నర ఎకరాల్లో చేపల పెంపకానికి రూ.4 లక్షల రుణం ఖరారు చేశారు. -
ఒకే దఫాలో రుణమాఫీ చేయాలి
–వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం –బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలి –వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి –దామరచర్లలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటన మిర్యాలగూడ : రైతుల పంట రుణాలను విడుతల వారీగా కాకుండా ఒకే దఫాలో మాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్లలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, పెట్టుబడులకు అయిన ఖర్చులను ప్రభుత్వం నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి చేలలో నీరు నిలిచి పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, వీటితో పాటు పెసర, కంది పంటలకు కూడా వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు, కల్వర్టులు తెగి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి బాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు ఎండీ సలీం, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మేష్యానాయక్, దామరచర్ల, మిర్యాలగూడ పట్టణ, మండలం, వేములపల్లి మండల పార్టీల అధ్యక్షులు అన్నెం కరుణాకర్‌రెడ్డి, ఎంవీఆర్‌రెడ్డి, పిలుట్ల బ్రహ్మం, పెదపంగ సైదులు, హుజూర్నగర్ మండలం, పట్టణ అధ్యక్షుడు జడ రామకృష్ణ, గుర్రం వెంకట్‌రెడ్డి, నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు కుందూరు మట్టారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇనుపాల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల అప్పులను ఒకేసారి చెల్లించాలి
–పాత రుణాలతో సంబంధం లేకుండా కొత్తవి ఇవ్వాలి – విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ కోదాడ: రైతలకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాలు మొత్తం అప్పును విడుతల వారీగా కాకుండా వడ్డీతో సహా ఒకేసారి చెల్లించాలని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడలో జరిగిన రైతుభరోసా దీక్షలో పాల్గొన్న ఆయన కొల్లు వెంకటేశ్వర్రావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి రుణాలు చెల్లించకపోవడం వల్ల రైతులకు బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులు పుట్టుక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. విద్య, వైద్య, నిత్యావసరాల ధరలు పెరగడం కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమన్నారు. ఇప్పటికీ కేవలం 21 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు అందుతున్నాయన్నారు. తెలంగాణలో రైతులు చెల్లించాల్సిన అప్పులు కేవలం రూ.16 వేల కోట్లేనని.. దానికి డబ్బు లేదంటున్న ప్రభుత్వం ఎవరూ అడగని మిషన్ భగీరథ పథకానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతు నెలంతా కష్టపడితే వచ్చే ఆదాయం కేవలం రూ.2015లు అని అందులో రూ.950 ఇతర పనులకు వెళ్లడం ద్వారా వస్తుందేనన్నారు. జాతీయ స్థాయిలో సగటున ప్రతి రైతుకు రూ.7400 అప్పు ఉంటే తెలంగాణలో మాత్రం రూ. 93,500 ఉందన్నారు. జాతీయ స్థాయిలో 45 శాతం రైతులు అప్పుల్లో ఉంటే తెలంగాణలో 89 శాతం మంది ఉన్నారరని పేర్కొన్నారు. క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి చేయడానికి రైతుకు రూ. 2600 ఖర్చు వస్తుంటే ప్రభుత్వం మాత్రం రూ.1470 మద్దతు ధర ప్రకటించడ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పంటల బీమా పథకంలో కమతాలను యూనిట్ తీసుకున్నప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. పాత అప్పులతో సంబంధంల ఏకుండా రైతులకు కొత్త లోన్లు ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర కాకుండా గిట్టుబాటు రేటు వచ్చే విధంగా చూడాలని, దళారులను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో వక్కంతుల కోటేశ్వర్రావు, బాదెరాము, రావెళ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.