రాయితీ కోసం రణం
ఇన్‌పుట్ సబ్సిడీ అందక రైతుల పాట్లు
– అర్జీలు ఇచ్చేందుకు జేడీఏ కార్యాలయం ఎదుట బారులు
– పరిహారం కోసం ఇంకా 1.37 లక్షల మంది ఎదురుచూపు
ఇన్‌పుట్ సబ్సిడీ నాకు రాలేదు, మా ఇంట్లో వాళ్లకీ రాలేదు. ఏమని అడిగితే జాబితాలో పేర్ల లేవంటున్నారు. భూములున్నాయి. పంటలు వేశాం. నష్టపోయాం. జరిగిన నష్టంపై పరిహారం కోసం పత్రాలు ఇచ్చాం. కానీ మాకు సంబంధించి ఆరు మంది పేర్లు జాబితాలో కనిపించడం లేదు. ఎందుకు తొలగించారో తెలియడం లేదు. మా లాంటి పేదల కడుపు కొట్టడం మంచిది కాదు. మండల అధికారులు ఇపుడు అర్జీలు ఇచ్చినా తీసుకోవడం లేదు. జేడీఏ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశాం.
– ఆత్మకూరు మండలం వేపచెర్లకు చెందిన దళిత రైతు సూర్యనారాయణ ఆవేదన ఇది.
పెట్టుబడి రాయితీ కోసం రైతన్నలు పెద్ద రణమే చేయాల్సి వస్తోంది. జాబితాలో పేర్లు గల్లంతవడం...బ్యాంకు ఖాతాలు మారిపోవడం తదితర సమస్యలతో రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. మండల కేంద్రాల్లోని అధికారులు ఫిర్యాదులు తీసుకోకపోవడంతో వారంతా జిల్లా కేంద్రానికి వస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు జేడీఏ కార్యాలయం ఎదుట బారులు తీరుతున్నారు.
అనంతపురం అగ్రికల్చర్: పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖరీఫ్–2016కు సంబంధించి 7.17 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, ప్రత్తి, పెసర, అలసంద తదితర 17 రకాల పంటలు దెబ్బతినగా... 6.25 లక్షల మంది బాధిత రైతులకు రూ.1,032.42 కోట్లు ఇన్‌పుట్ పరిహారం విడులైంది. అయితే ఇన్‌పుట్ పంపిణీతో పాటే సమస్యలూ ప్రారంభమయ్యాయి. రైతుల పేర్లు, గ్రామం, భూవిస్తీర్ణం, ఆధార్, బ్యాంకు అకౌంట్, ఐఎఫ్‌ఎసీ కోడ్ తదితర వివరాలు అప్‌లోడ్ చేయడంలోనూ, జాబితాలు రూపొందించడంలో పెద్ద ఎత్తున పొరపాట్లు జరగడం, కొన్ని చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పనిచేయడంతో జాబితాలు తప్పులతడకలు మారినట్లు రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. చేతికొచ్చిన పరిహారం నోటికందే పరిస్థితి కనిపించకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతులకు జరగుతున్న అన్యాయంపై రైతు సంఘాలు, విపక్షాలు చంద్రబాబు సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. విడుదలైన పరిహారం ఎలా దక్కించుకోవాలో అర్థం కాక రైతులు నానా పాట్లు పడుతున్నారు.
1.37 లక్షల మంది ఎదురుచూపు
అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు 5.01 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.827 కోట్ల జాబితాలు అప్‌లోడ్ చేసి ట్రెజరీకి సమర్పించారు. అక్కడి నుంచి 4.88 లక్షల మంది ఖాతాల్లోకి రూ.801 కోట్లు జమ అయింది. ఈ లెక్కన ఇంకా 1.24 లక్షల మందికి సంబంధించి రూ.205 కోట్ల జాబితాలు అప్‌లోడ్ కావాల్సి ఉంది. మొత్తమ్మీద చూస్తే రూ.231 కోట్ల పరిహారం కోసం 1.37 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
ఫిర్యాదుల వెల్లువ
లక్షలాది మందికి పరిహారం అందకపోవడంతో మండలాలు, డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రం, జేడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఫోన్ల ద్వారా కూడా ఫిర్యాదులు రోజూ వందల సంఖ్యలో వస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా అంతటా 75 వేల దాకా ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇష్జారాజ్యంగా తయారైన జాబితాల వల్ల కొన్ని గ్రామాల్లో పరిహారం పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపేశారు. నెలాఖరులోగా అర్హులందరికీ పరిహారం జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
మంజూరైన ఇన్‌పుట్ సబ్సిడీ : 1,032.42 కోట్లు
రైతుల సంఖ్య : 6.25 లక్షల మంది
ఇప్పటివరకు అప్‌లోడ్ అయిన జాబితా : 827 కోట్లు
రైతుల సంఖ్య : 5.01 లక్షల మంది
ఖాతాల్లో జమ అయిన మొత్తం : 801 కోట్లు
లబ్ధిపొందిన రైతులు : 4.88 లక్షల మంది
ఇంకా జమ కావాల్సిన పరిహారం : 231 కోట్లు
పరిహారం ఎదురుచూస్తున్న రైతులు : 1.37 లక్షల మంది