
సేద్యం బరువై...!
పరిగి: కూలీల ఖర్చులకు కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో వ్యయాన్ని తగ్గించుకునేందుకు పరిగి మండలంలోని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. మండలంలోని కొడిగెనహళ్లికి చెందిన కె.ఆదెప్ప అనే రైతు తన పొలంలో కలుపు తీసేందుకు సైకిల్ చక్రానికి చిప్ప గుంటకను తయారు చేసుకొని చేనులో దున్నుతున్నాడు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నందునే అవి భరించే శక్తి తనకు లేకపోవడంతో ఈ ఆలోచన వచ్చిందని రైతు తెలిపాడు.
మొక్కజొన్న వేసిన తన పొలంలో కలుపు తీసేందుకు ఓ సైకిల్ చక్రానికి గుంటకను చేయించి కేవలం రూ.1500 ఖర్చుతో ఈ యంత్రాన్ని తయారు చేయించానన్నాడు. తనకున్న ఎకరా పొలంలో కుమార్తె అరుణ, అల్లుడు చౌడప్ప సహాయంతో ఇలా కలుపును తొలగిస్తున్నానని తెలిపాడు. వినూత్న ఆలోచనతో కలుపు తీస్తున్న ఆదెప్పను పలువురు రైతులు అభినందిస్తున్నారు.