
విత్తన వేరుశనగ కోసం ఎదురుచూపు
- ఎప్పుడు ఇచ్చేదీ చెప్పలేమంటున్న అధికారులు
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో నీటి వసతి కింద పంట సాగు చేసేందుకు వీలుగా విత్తన వేరుశనగ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎపుడిస్తామో చెప్పలేమంటూ వ్యవసాయశాఖ అధికారులు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు రబీ పంటగా వేరుశనగ విత్తుకునేందుకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది నవంబర్ 8వ తేదీ నుంచి విత్తన వేరుశనగ పంపిణీ చేశారు. దీంతో రైతులు సకాలంలో విత్తుకున్నారు. ఈ సారి మాత్రం ఆ దిశగా ఎలాంటి సన్నాహాలు చేపట్టకపోవడంతో ఇస్తారో.. లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రబీలో బోరుబావులు, ఇతరత్రా నీటి వసతులున్న 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతూ వస్తోంది. ఏటా ఖరీఫ్‌లో విత్తన వేరుశనగ సమస్యను అధిగమించాలంటే రబీలో పండించే పంట కీలకం. వర్షాలను నమ్ముకుని సాగు చేసిన ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బ తినడంతో జిల్లాలో రైతుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. విత్తన వేరుశనగ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత కూడా చాలామందికి లేకపోయింది.
రబీ రైతులకు 15 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ కేటాయించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా వాటి ధరలు, రాయితీలు, మార్గదర్శకాలు, పంపిణీ ఎప్పుడనేదీ చెప్పడం లేదు. ఆ దిశగా కసరత్తు చేసిన దాఖలాలు కూడా లేకపోవడంతో బాగా ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా గతేడాది మండల కేంద్రాల్లో పర్మిట్లు తీసుకుని అనంతపురం, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, పెనుకొండ, హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి డివిజన్ కేంద్రాల్లో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం క్వింటా ధర రూ.6,300గా నిర్ణయించి అందులో 33 శాతం రాయితీ పోనూ రూ.4,200లతో రైతులకు 15వేల క్వింటాళ్ల విత్తనం పంపిణీ చేశారు. ధరలు, రాయితీలు ఖరారు కాగానే ఈ సారి కూడా త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు.