♦ ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతన్నల పాట్లు
♦ గత ఏడాది 16 వేల హెక్టార్లలో పంట నష్టం
♦ తుఫానుతో కుళ్లిపోయిన వేరుశనగ
♦ కంటితుడుపుగా రూ. 23.80 కోట్లతో ప్రతిపాదనలు
♦ నేటికీ విడుదల కాని నిధులు
♦ పట్టించుకోని పాలకులు
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయ, రెవెన్యూతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గతేడాది నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో (2015కు సంబంధించి) పంట నష్టం అంచనా వేశారు. 33 మండలాల పరిధిలో 23.80 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తేల్చిచెప్పారు. 16,311 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 15,167 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు పెట్టుబడిరాయితీ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. గత 15 సంవత్సరాల్లో ఎపుడూ లేని విధంగా నామమాత్రపు ఇన్‌పుట్ సబ్సిడీతో నివేదిక పంపేసి జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఏడాదవుతున్నా పరిహారాన్ని మంజూరు చేయించడంలో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తున్నారు.
తుఫాను తాకిడికి అతలాకుతలం
వాస్తవానికి గతేడాది నవంబర్‌లో వేరుశనగ పంట తొలగించే సమయంలో సంభవించిన తుఫాను వర్షాలకు వేరుశనగతో పాటు పత్తి, పెసర తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ నెలలో 2న 12.9 మి.మీ, 10న 11.5 మి.మీ, 11న 12 మి.మీ, 18న 18.7 మి.మీ, 25న 8.1 మి.మీ చొప్పున భారీ సగటు వర్షపాతం నమోదైంది. విరామం లేకుండా కదిరి, పుట్టపర్తి డివిజన్లలో భారీ గానూ ధర్మవరం, పెనుకొండ, హిందూపురం డివిజన్ల పరిధిలో మోస్తరుగా వర్షాలు పడ్డాయి. మొత్తమ్మీద నవంబర్ నెల సాధారణ వర్షపాతం 34.7 మి.మీ కాగా ఏకంగా 99.6 మి.మీ వర్షం కురిసింది.
నెలలో నాలుగైదు రోజులు మినహా తక్కిన రోజుల్లో వర్షపాతం నమోదు కావడం విశేషం. దీంతో తొలగించిన వేరుశనగ పంట పొలాల్లోనే కుళ్లిపోయింది. వేరుశనగ కట్టె గ్రాసానికి కూడా పనికిరాలేదు. కాయలు రంగు మారి మొలకెత్తాయి. ఇంకా తొలగించని ప్రాంతాల్లో కూడా మొలకలు రావడంతో రైతులకు భారీగానే నష్టం జరిగింది. ఇలా అంతోఇంతో చేతికొచ్చిన పంట దక్కకుండా పోయింది. తుఫాను వర్షాలకు 30 వేల హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో వేరుశనగ దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ 16 వేల హెక్టార్లకే అధికారులు పరిమితం చేయడం విశేషం. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో పర్యటించి ఇన్‌పుట్ సబ్సిడీతో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ... ఇప్పటి వరకు పైసా కూడా మంజూరు చేయని పరిస్థితి నెలకొంది.
ఏడాదిగా ఎదురుచూపు
Published Mon, Sep 12 2016 12:15 AM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
Advertisement
Advertisement