మద్యం మత్తులో కొడుకును హతమార్చిన తండ్రి
కూనవరం(రాజోలు) : కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి తన 12 ఏళ్ల కొడుకును మద్యం మత్తులో పొట్టన పెట్టుకున్నాడు. రాజోలు మండలం కూనవరం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. కూనవరం గ్రామానికి చెందిన నేల కల్యాణ్‌కుమార్(12)ను తండ్రి నేల శ్రీనివాసరావు మద్యం మత్తులో చెంపమీద కొట్టాడు. దీంతో ఆ బాలుడు పక్కనే ఉన్న రాయిపై పడడంతో తలకు బలమైన గాయమైంది. బంధువులు, స్థానికులు బాలుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కల్యాణ్‌కుమార్ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కల్యాణ్‌కుమార్ తండ్రి శ్రీనివాసరావు, తల్లి పద్మ. శ్రీనివాసరావు పెట్టే ఇబ్బందులు తాళలేక పద్మ విడాకులు ఇచ్చి అండమాన్ వెళ్లిపోయింది. అప్పటి నుంచి కల్యాణ్‌కుమార్ తండ్రి వద్దే ఉంటున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండే కల్యాణ్‌కుమార్ అంటే తాత సుదర్శనరావు, బంధువులు, ఇరుగుపొరుగువారికి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కల్యాణ్‌కుమార్ 6వ తరగతిలో స్కూల్ ఫస్ట్ రావడంతో అందరూ అభినందించారు. కొత్త సైకిల్ కొని ఇచ్చారు. ఏడో తరగతిలోకి వెళ్లిపోతున్నానంటూ అందరితో గర్వంగా చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ తిరిగే కల్యాణ్‌కుమార్ మృతి చెందడంతో ఆ ప్రాంతవాసులు విషాదంలో మునిగిపోయారు. తండ్రి శ్రీనివాసరావు ఎప్పుడూ కొడుకుపట్ల శాడిస్ట్‌గా వ్యవహరించేవాడని, ఎక్కువగా కొట్టేవాడని, తండ్రి వస్తున్నాడంటే భయంతో ఇరుగుపొరుగు ఇళ్లల్లో కల్యాణ్‌కుమార్ దాక్కునే వాడని స్థానికులు తెలిపారు. తాత సుదర్శనరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.