మెప్మాలో కీచకులు
పేట్రేగుతున్న కామాంధులు
ఎవరికీ చెప్పలేక కుమిలిపోతున్న మహిళలు
తిరుపతి సెంట్రల్: మెప్మాలో కీచకలు తిష్టవేశారు. ఆర్థిక వెతలనే ఆసరాగా చేసుకుని మహిళలను లైంగిక వైధింపులకు గురిచేస్తున్నారు. మాటవినకపోతే బ్యాంక్ నుంచి తీసుకున్న లింకేజీ రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేయిస్తున్నారు. అదీ కుదరకపోతే పైఅధికారులతో ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత జిల్లా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
ఇవిగో సాక్షాలు
తిరుపతిలోని జానకిరామ సమాఖ్యలో అన్నపూర్ణ సంఘం సభ్యురాలు, స్పందన మాజీ కార్యదర్శిగా పనిచేసిన ఓ మహిళ మెప్మా ద్వారా ఏడాది క్రితం బ్యాంక్ నుంచి లింకేజీ రుణం తీసుకుని ‘సుగుణ డ్వాక్రా క్యాంటీన్ ’ ఏర్పాటు చేశారు. ఇటీవల కంటి ఆపరేషన్ కోసం రెండు నెలలు క్యాంటీన్ మూసివేశారు. బ్యాంకు రుణం సకాలంలో చెల్లించలేకపోయారు. మెప్మాలో ఆదుకునే వారు కరువయ్యారు. మెప్మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో–ఆర్డినేటర్ నుంచి వేధింపులు.. అసభ్యకర మాటలు, బ్యాంక్ అధికారుల ఒతిళ్లు ఎక్కువయ్యాయి. వీటిని ఖండించాల్సిన ఓ సీవో స్థాయి మహిళ కూడా సదరు అధికారి ‘చెప్పినట్టు’ నడుచుకోవాలి.. అంటూ వేధింపుల్లో భాగమైందని బాధిత మహిళ వారం కిత్రం మీడియా ఎదుట బోరుమన్నారు. ఇదిలావుండగా సంఘంలోని ఓ మహిళా సభ్యురాలు కుమార్తెకు ఉద్యోగం తీసిచ్చినందుకు సదరు అధికారి ఆ సభ్యురాలిని రాత్రి 8గంటలకు ‘లీలామహల్ సెంటర్’కు రావాలనడంతో ఆమె అవాక్కయినట్టు సమాచారం. ఇలాంటి సంఘటనలపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు.
ఆయన చేయి అభయ హస్తమేనట
ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, చంద్రన్న బీమా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. చంద్రన్నబీమా చేసి ఎవరైనా చనిపోతే రూ.30 వేలకు రూ.1,000, రూ.1లక్ష బ్యాంక్ లోను తీసిస్తే రూ.10వేలు కమీషన్ ఇచ్చుకోవాల్సిందే. సదరు అధికారి సంతకం ఉంటేనే లోను ఇచ్చేలా బ్యాంకు అధికారులను సైతం మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. మెప్మాలో ఓ ‘పెద్ద’ సారు తన వెనకుండారని, ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే అల్లుడు చూసుకుంటారని సదరు అధికారి తరచూ అంటుండేవాడని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రన్న బీమా పేరుతో సంఘంలో సంబంధం లేని వారి నుంచి దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. స్కాలర్‌షిప్‌లను సైతం తన జేబులో వేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
విచారించి చర్యలు తీసుకుంటాం
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడం నేరం. అలాంటివి మెప్మాలో జరిగే అవకాశం లేదు. ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. తిరుపతిలో జరుగుతున్న సంఘటనపై విచారణ చేయిస్తా. తప్పు చేసినట్టు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. –నాగపద్మజ, జిల్లా పథక సంచాలకులు, మెప్మా