‘కస్తుర్బా’కు జ్వరమొచ్చింది
ఎం.తిమ్మాపురం(మహానంది: ఎం.తిమ్మాపురం గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు జ్వరమొచ్చింది. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 190 మంది విద్యార్థులు ఉన్నారు. గత నెల 26వ తేదీ నుంచి గత కొద్దిరోజులు విద్యార్థులు అతిసారం బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10వ తేదీ నుంచి వరుసగా జ్వరాల బారిన పడుతున్నారు. వీరి సంఖ్య 80కి చేరింది. ఒకే పాఠశాలలో ఏకంగా 80 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడటానికి ప్రధాన కారణం భవనంలో ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండటమే. పాఠశాల వెనుక భాగం అంతా మూసీ నదిని తలపిస్తోంది. రాత్రయితే దోమలు.. పగలు పందులు విహారం చేస్తున్నాయి. విద్యార్థులు వరుసగా జ్వరాల బారిన పడ్డారు. రక్తపరీక్షలు చేస్తే అందరికి టైఫాయిడ్ జ్వరాలు సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పాఠశాలకు వచ్చి వారి పిల్లలను తీసుకెళ్లారు. ప్రస్తుతం మనీషా, రేణుక, సుధా, సోని, లక్ష్మిప్రసన్న, సోఫియా, మమత, తదితరులు జ్వరాల బారిన పడి హాస్టల్ గదికే పరిమితమయ్యారు.
ఉన్నతాధికారులకు తెలిపాం– పుష్పలత, ఎస్‌ఓ
పాఠశాలలో ఉన్న మురుగునిల్వ సమస్యపై ఉన్నతాధికారులకు తెలియచేశాం. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం విద్యార్థులకు ఉన్న అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నంద్యాల పట్టణం నుంచి మినరల్ వాటర్ తెప్పించి ఇస్తున్నాం. అస్వస్థతకు గురైన వారికి మందులు అందజేస్తున్నాం.