పల్లెకు జరం | Fever of the village | Sakshi
Sakshi News home page

పల్లెకు జరం

Published Tue, Sep 19 2017 4:52 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

పల్లెకు జరం - Sakshi

పల్లెకు జరం

  • వణికిస్తున్న జ్వరాలు
  • ఆస్పత్రుల ఎదుట బారులు తీరుతున్న రోగులు
  • నానాటికీ పెరుగుతున్న పీడితులు

    వాతావరణంలో మార్పులు...ఎటు చూసినా అపరిశుభ్రత...ఆపై దోమల దండయాత్ర... సీజన్‌ వ్యాధుల నివారణకు యంత్రాంగం కనీస చర్యలు తీసుకోకపోవడంతో పల్లెలకు జ్వరమొచ్చింది. వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలడంతో హిందూపురం జిల్లా ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. పట్టణశివారులోని మురికివాడల నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి మలేరియా, టైఫాయిడ్, వైరల్‌ ఫీవర్స్‌ బాధపడుతున్న వారు వందలాదిగా ఆస్పత్రికి తరలివస్తున్నారు. జ్వరపీడితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండడం... డెంగీ లక్షణాలు కనిపిస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.
  •  

    మంచాలూ కరువే
    హిందూపురం ఆస్పత్రిలో 20 మంది వైద్యులుండాలి. కానీ ప్రస్తుతం 12 మందే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇన్‌పేషెంట్ల సంఖ్య మూడొంతులు పెరగడంతో ఇక్కడి వైద్యులు అందరికీ మెరుగైన వైద్యసేవలందించలేకపోతున్నారు. మరోవైపు మంచాల కొరత వేధిస్తుండడంతో ఒకే మంచంపై ముగ్గురిని ఉంచి చికిత్సలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరికొందరిని నేలపైనే పడుకోబెట్టి చికిత్సలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన వారంతా నరకం చూస్తున్నారు.

    ప్రైవేటు ఆస్పత్రులు కిటకిట
    ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వసతులు లేకపోవడం...కనీసం బెడ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో జనం అంతా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో హిందూపురం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఆస్పత్రి వద్ద చూసినా చాంతాడంత క్యూ ఉంటోంది. ఇక చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద రద్దీ చెప్పలేనంతగా ఉంది.  దీంతో గంటల తరబడి వేచి చూస్తే గానీ చిన్నారులకు వైద్యం అందడం లేదు. టోకెన్‌ పేరుతోనే రూ. వందలు వసూలు చేస్తున్న ప్రైవేటు వైద్యులు... చిన్నపాటి జర్వానికే రక్త, మూత్రపరీక్షలు చేయిస్తున్నారు. దీనికి తోడు వేలాది రూపాయల మందులు, టానిక్‌లు రాసిస్తూ ప్రజలు దోచుకుంటున్నారు. దీంతో పేదలు అప్పులు చేసి మరి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

    నీరు కలుషితం కావడం వల్లే...
    నీరు కలుషితం కావడం వల్లే వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎటుచూచినా అపరిశుభ్రత...దోమలు, పందుల బెడద ఎక్కువగా ఉండడం కూడా రోగాలు వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. పరిస్థితి ఇంతగా విషమిస్తున్నా...స్వచ్ఛత చర్యలు చేపట్టడంతో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. కనీసం ఫాగింగ్ కూడా చేపట్టకపోవడంతో జనమంతా దోమకాట్లతో జ్వరాలబారిన పడుతున్నారు.

    పిల్లలిద్దరీ జ్వరమే
    మా ఇద్దరి పిల్లలకు తీవ్ర జ్వరం వచ్చింది. వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తే మంచాలు లేవన్నారు. ఒకే మంచంపై ఇద్దరికి చికిత్సలు చేస్తున్నారు. నాలుగురోజులుగా ఆస్పత్రిలోనే ఉంచి చికిత్సలు చేయిస్తున్నాము. ఉదయం బాగుంటుంది సాయంత్రం మళ్లీ జ్వరమొస్తోంది. డాక్టర్లు చూస్తున్నా జ్వరం తగ్గడం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లడానికి డబ్బులేక ఇక్కడే ఉంటున్నాం. - మమత, నీలంపల్లి.

    డెంగీ అంటున్నారుమా బాబుకు మూడురోజులు నుంచి వైద్యం చేయిస్తున్నా జ్వరం తగ్గడంలేదు. రక్తపరీక్షలు చేసి డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. చికిత్సలు చేస్తున్నా జ్వరం తగ్గడం లేదు. ఆస్పత్రిలో సరైన వసతులు లేవు. నీళ్లుకూడా ఇబ్బందే. - జ్యోతి, కొడిగినహల్లి.

    ఎవరూ పట్టించుకోవడం లేదు
    జ్వరంతో మా కుమారుడు నరేంద్రను ఆసుపత్రిలో చేర్చాము. రెండురోజులు అవుతోంది. సెలైన ఎక్కిస్తున్నారు. జ్వరం మాత్రం తగ్గడంలేదు. పిల్లాడు నీళ్లు కూడా తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్, నర్సులకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. జ్వరం కూడా తగ్గడంలేదు ఏం చేయాలో దిక్కుతోచడంలేదు. నాగమ్మ, కొత్తసమర్లపల్లి.

     

    ఐదురోజులైనా...
    నా మనువడికి ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రిలో చేర్చి ఐదురోజులైనా ఏమాత్రం కుదుటపడలేదు. పరీక్షలు చేస్తునే ఉన్నారు. జ్వరం తగ్గుతుందని అంటున్నారు. ఏమీ ప్రయోజనం లేకుండా పోతోంది. - నరసమ్మ, పరిగి.

    ఉదయం నుంచి పాడిగాపులు..
    నా కూతురుకు జ్వరమొచ్చింది. ఆస్పత్రికివస్తే పరీక్షలుచేసి సెలైన్‌బాటిల్‌ చేతికిచ్చి వేచి ఉండమన్నారు. ఉదయం నుంచి వేచి చూస్తున్నా...ఇప్పటికీ బిడ్డకు మంచం ఇవ్వలేదు. పిల్లలను బెంచీలపైనే పడుకోపెట్టుకుని ఉంటున్నాం. : అశ్వర్థమ్మ, సంతేబిందనూర్‌.

    నెలపైనే కుర్చోవాల్సి వస్తోంది
    జ్వరం, దగ్గుతో బాధపడుతున్న నా కుమారుడిని ఆస్పత్రిలో చేర్చడానికి వస్తే మంచంలేదన్నారు. నెలపైనే ఉంటున్నాం. ఎవరైనా డిచార్చ్‌ అయితే మంచం ఇస్తామంటున్నారు. దోమలు ఎక్కువగా ఉన్నాయి. దోమలదెబ్బకు విష జ్వరాలు వచ్చేలా ఉన్నాయి.
    - వహిదా, హిందూపురం.

    పనిభారం ఎక్కువైంది
    సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు సిబ్బంది కొరతతో పనిభారం ఎక్కువైంది. రోగులు మూడొంతలు మేర పెరిగారు. మంచాలు తక్కువగా ఉన్నాయి. ఉన్నంతలోనే అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఎంసీహెచ్‌ సెంటర్‌ ప్రారంభమైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.- డాక్టర్‌ కేశవులు, సూపరింటెండెంట్‌.

    హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి
    పడకలు                : 100
    వైద్యులు              : 12
    వైద్యపోస్టుల ఖాళీ       : 08

    ఆవుట్‌ పేషెంట్స్‌ సంఖ్య
    జూలై – 23,976
    ఆగస్టు – 21,460
    సెప్టెంబరు 14వతేది వరకు–16,761
     

    ఇన్‌పెషేంట్ల సంఖ్య
    జూలై – 2,659
    ఆగస్టు – 2,337
    సెప్టెంబరు 14వరకు – 1,791

    డెంగీ లక్షణాలు పరీక్షలు
    నెల                               సంఖ్య     పాజిటివ్‌
    జూలై –                         119      –     7
    ఆగస్టు–                         139   –     6
    సెప్టెంబరు నేటివరకు –   12     –    నిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement