జిల్లాను చుట్టుముట్టిన విషజ్వరాలు
- ఈదురుగాలులు, వర్షాలతో మారిన వాతావరణం
- రోగులతో కిక్కిరిసిన ఆసుపత్రులు
- అధికారికంగా 133 మలేరియా కేసులు నమోదు
- ముందస్తు నివారణ చర్యలు చేపట్టని అధికారులు
- మూలనపడిన ఫాగింగ్ మిషన్లు
సాక్షిప్రతినిధి, అనంతపురం : విషజ్వరాలతో పల్లెలు మంచం పట్టాయి. ఏ గ్రామానికి వెళ్లినా జ్వర పీడితులు వందల సంఖ్యలో ఉంటున్నారు. ఈదురుగాలులు, వర్షాలతో వాతావరణంలో మార్పు చోటు చేసుకోగా.. దోమల బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 133 మందికి మలేరియా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన రోగుల సంఖ్య మాత్రమే. ప్రయివేట్ ఆసుపత్రుల్లో చేరి విషజ్వరాలతో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. గత ఏడాది డెంగీతో 20 మందికి పైనే మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది కూడా డెంగీ భయపెడుతోంది. అయినా దోమల నివారణ విషయంలో పంచాయతీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటి వరకు ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్ కూడా పిచికారీ చేయకపోవడంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దోమల నివారణకు చర్యలు కరువు
వర్షాకాలంలో పట్టణాలతో పాటు పల్లెల్లో ఫాగింగ్ తప్పనిసరి. ఇందుకోసం గత కలెక్టర్ సాల్మన్ ఆరోక్యరాజ్ 70 ఫాగింగ్ మిషన్లు తెప్పించి పంచాయతీలకు అప్పగించారు. అయితే ఈ ఏడాది అవన్నీ మరమ్మతులకు గురయ్యాయని పక్కన పడేశారు. ఫాగింగ్ చేసేందుకు మలేరియా నియంత్రణ శాఖకు వెయ్యి లీటర్లకు పైగా మలాథియాన్ ద్రావణం వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఫాగింగ్‌కు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫాగింగ్ మిషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే.. ఆంటీలార్వా యాక్టివిటీతోనే దోమల నివారణ సాధ్యమనేది మలేరియా అధికారులు భావనగా ఉంది.
ఆంటిలార్వా యాక్టివిటీ అంటే..
ఫాగింగ్ చేస్తే పొగ గాలి వాటుకు మొత్తం వెళ్లిపోతోంది. దీనికి దోమలు చనిపోవడం చాలా తక్కువ. దోమలను నివారించాలంటే గుడ్డు, లార్వా దశలోనే చంపేయాలి. దీనికి పంచాయతీల్లో అబేట్ అనే ద్రావణాన్ని కాలువలు, గట్లపై పిచికారీ చేయాలి. మునిసిపాలిటీలో ఎంఎల్ ఆయిల్(మలేరియా లారిఫైడ్ ఆయిల్)ను వాడాలి. బీటీఐ ఆయిల్, పౌడర్, పైరిథ్రిన్ కూడా వినియోగిస్తారు. దీంతో లార్వా దశలోనే నివారణ సాధ్యమవుతుంది. అయితే ఈ రకమైన నివారణ చర్యలు కొన్ని జిల్లాల్లోనే అవలంబిస్తున్నారు. ఇక్కడా కూడా ఆ ప్రక్రియ మొదలుపెడితే దోమల నివారణ సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కనిపించని సమన్వయం
దోమల నివారణ బాధ్యత పంచాయతీ, మునిసిపల్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులది. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేసి నివారణ చర్యలు తీసుకోవాలి. కానీ ఈ మూడు శాఖల అధికారుల్లో సమన్వయం కొరవడింది. సీజన్ మొదలైన తర్వాత ఏ ప్రాంతం, ఏ గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది? నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుందాం? హెల్త్‌క్యాంప్‌లు నిర్వహిద్దామా? అనే దిశగా ఆలోచించకపోవడం గమనార్హం.
వైద్యశాఖ పనితీరు అంతంతమాత్రమే!
జిల్లాలో 80 పీహెచ్‌సీ(ప్రెమరీ హెల్త్ సెంటర్)లు.. 586 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు 42. వీటి పరిధిలోని ఏఎన్‌ఎంలు సరిగా విధులకు హాజరకావడం లేదు. సబ్‌సెంటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పీహెచ్‌సీలలో ఉదయం 9–12 గంటల వరకు ఓపీ నిర్వహించాలి. చాలా చోట్ల 10.30 గంటల వరకు డాక్టర్లు రాని పరిస్థితి. పైగా మధ్యాహ్నం 12 గంటలకే ఇంటిదారి పడుతున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నర్సులు మాత్రమే ఆస్పత్రిలో ఉంటారు. ఈ సమయంలో జ్వరం వచ్చిందని రోగులు ఆస్పత్రులకు వెళితే మాత్రలు చేతిలో పెట్టడం.. లేదంటే ఓ ఇంజక‌్షన్ వేసి పంపుతున్నారు. ఏ జ్వరం వచ్చింది? ఏ మందులు ఇవ్వాలని చూసేందుకు డాక్టరు ఉండటం లేదు. పైగా నీడిల్, సిరంజి బయట నుంచి రోగులు తెచ్చుకోవల్సి వస్తోంది. ఈ కారణంగా రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడికి వెళితే రక్తపరీక్షలు, మందులతో భారీగా ఖర్చవుతోంది. జ్వరంతో ఓ రోగి ప్రయివేట్ ఆస్పత్రికి వెళితే సాధారణ జ్వరమైతే రూ.వెయ్యి.. మలేరియా, టైఫాయిడ్ అయితే రూ.5వేల దాకా ఖర్చవుతోంది.
సిద్ధంగా ఉన్నాం
విషజ్వరాల సీజన్ మొదలైంది. మలాథియన్ ద్రావణం ఉంది. ఆంటి లార్వా యాక్టివిటీకి కూడా సిద్ధంగా ఉన్నాం. అత్యవసర ప్రాంతాలను కూడా గుర్తించి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తాం. ఇప్పటి వరకూ అధికారికంగా 133 మలేరియా కేసులు నమోదయ్యాయి.
- దోసారెడ్డి, మలేరియా నివారణ జిల్లా అధికారి
పల్లె.. రోగాల ముల్లె
Published Sat, Jul 15 2017 11:09 PM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement