జ్వరాల పంజా
– ‘అనంత’లో ప్రబలుతున్న జ్వరాలు
– మురికివాడలు, శివారుకాలనీల్లో పరిస్థితి ఘోరం
– మలేరియా, టైఫాయిడ్‌తో తల్లడిల్లుతున్న జనం
– నామమాత్రంగా పరిశుభ్రత చర్యలు
అనంతపురం మెడికల్ : ఒడిలో కుమారుడు.. పక్కన మంచంపై కుమార్తెతో దీనంగా కూర్చున్న ఈ మహిళ పేరు జైను. భర్త షఫి మెకానిక్. కొడుకు షరీఫ్ (4) నర్సరీ, కుమార్తె సోఫియా (6) యూకేజీ చదువుతున్నారు. అనంతపురంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో వీరి నివాసం. నాలుగు రోజుల నుంచి ఇద్దరు పిల్లలకూ జ్వరం వస్తుండడంతో స్థానిక సర్వజనాస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు అధ్వానంగా ఉంటాయని, ఎవరూ శుభ్రం చేయరన్నది జైను ఆవేదన.
===
ముద్దులొలికే ఈ చిన్నారి పేరు యాస్మిన్. వయసు ఒకటిన్నర ఏడాది. తండ్రి సైసావలి టమాట మార్కెట్‌లో పని చేస్తుంటాడు. తల్లి సైదాని గృహిణి. అనంతపురంలోని రాణీనగర్‌లో నివాసం. మూడు రోజుల నుంచి ఈ చిన్నారికి తీవ్ర జ్వరం వస్తుండడంతో అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. టైఫాయిడ్ అని తేలడంతో తల్లి కంగారు పడుతోంది.
===
అనంతపురంలోని కేవీఎస్ నగర్‌కు చెందిన షమీనా, షమీవుల్లా దంపతుల కుమారుడు గౌస్ (3). నెల రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. గతంలో సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో వారం పాటు ఉన్నాడు. డిశ్చార్జ్ అయి వెళ్లిపోగా మళ్లీ జ్వరం రావడంతో ఆస్పత్రికి వచ్చాడు. బాలుడి కళ్లన్నీ ఎర్రగా మారాయి. ముఖం వాచింది.
===
వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం వల్ల ‘అనంత’పై దోమలు దండెత్తుతున్నాయి. పారిశుద్ధ్యం పడకేసింది. ఇదే అదునుగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లా అధికారులంతా నివాసముండే అనంతపురం నగరంలోనే పరిస్థితి దారుణంగా ఉంది. స్మార్ట్‌సిటీ, స్వచ్ఛ అనంత అంటూ బీరాలు పలుకుతున్న ప్రజాప్రతినిధులకు పారిశుద్ధ్యలోపం, జ్వరాల బారిన పడుతున్న ప్రజలు కన్పించడం లేదు. అపరిశుభ్రత నివారణకు పటిష్ట చర్యలు తీసుకోండని ఆదేశాలు జారీ చేసే ఉన్నతాధికారులకూ దీనిపై పట్టింపులేదు. మూడు నెలల క్రితం ‘దోమలపై దండయాత్ర’ అంటూ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా ఫలితం మాత్రం మేడిపండు చందంగా మారింది.
శనివారం మాత్రమే అధికారులకు ‘దోమలు’ గుర్తొస్తున్న పరిస్థితి. వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్‌టీం మొక్కుబడిగా మారింది. మురికివాడలు, శివారు కాలనీల్లో జనం జ్వరాలతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జ్వరపీడితులు కొందరు సర్వజనాస్పత్రికి పరుగు పెడుతుంటే.. మరికొందరు ఆర్‌ఎంపీ క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రాణీనగర్, ఫెర్రర్‌కాలనీ, వినాయక్‌నగర్, భాగ్యలక్ష్మినగర్, మరువకొమ్మకాలనీ, అంబేడ్కర్‌నగర్, ఎర్రనేల కొట్టాల, పిల్లిగుండ్లకాలనీ తదితర ప్రాంతాల్లో జనావాసాల మధ్యే మురుగునీరు వెళుతోంది.
దీనివల్ల దోమలు ప్రబలి.. జ్వరాలు అధికమవుతున్నాయి. కీ ప్రాంతాలపై నగరపాలక సంస్థ అధికారులు కూడా శీతకన్ను వేస్తున్నారు. కాలువలు సరిగా శుభ్రం చేయడం లేదు. చెత్తాచెదారాన్ని రోజుల తరబడి అలాగే వదిలేస్తున్నారు. ఇక పందుల బెడదా అధికమే. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పైపులు పగిలిపోయి మంచి నీరు కలుషితమవుతోంది. ఓవర్ హెడ్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయడం లేదు. పాట్ క్లోరినేషన్‌పై అవగాహన కల్పించడం లేదు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.వెంకటరమణను ‘సాక్షి’ వివరణ కోరగా.. జ్వర ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెడతామన్నారు. ప్రత్యేక బృందాలను పంపి నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.