జనగామ జిల్లా కోసం పోరాడుతాం
-
జనగామ జేఏసీ నాయకుల ఆమరణ దీక్ష విరమింపజేసి అఖిలపక్ష నాయకులు
ఎంజీఎం : హన్మకొండ జిల్లా ఏర్పాటును రద్దు చేసి, జనగామను జిల్లాగా ప్రకటించే వరకూ వరంగల్ పరిరక్షణ సమితి పోరాడుతుందని అఖిలపక్ష నాయకులు గురువారం రాత్రి జనగామ జేఏసీ నాయకులకు నిమ్మరసం అందిం చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వరంగల్ పరిరక్షణ సమితి కన్వీనర్ బైరపాక జయప్రకాశ్ మాట్లాడారు. జనగామ జిల్లా కోసం ఆరు నెలలుగా పోరాటం చేస్తున్న ప్రజ ల ఆకాంక్షను గౌరవించకుండా, ఎవరూ కోరని హన్మకొండను జిల్లాగా ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా బంద్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో బహిరంగ సభ నిర్వహించి, కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. చారిత్రాత్మక ఓరుగల్లును విడదీస్తూ హన్మకొండ జిల్లా ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్, ఈవీవీ శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, న్యూడెమోక్రసీ అధ్యక్షుడు అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా అమరేందర్‌రెడ్డి, అడ్వకేట్స్ జేఏసీ నాయకులు మద్దసాని సహోదర్, చిల్లా రాజేంద్రప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు పాల్గొన్నారు.