
పోరుకు నడుం బిగించిన యువత
రాజకీయ, యువజన, విద్యార్థి, కార్మిక సంఘాలు ఏకం
నేడు చిత్తూరులో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
ఉద్యమానికి సన్నద్ధమవుతున్న మహిళా శక్తి
ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో నగరిలో కొవ్వొత్తుల ర్యాలీ
చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి మానవహారం
జిల్లా అంతటా ప్రత్యేక పోరు ఊపందుకుంటోంది. హోదా సాధన కోసం అన్ని వర్గాల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. రాజకీయ, యువజన, విద్యార్థి, కార్మిక, మహిళా సంఘాలు ఏకం అవుతున్నాయి. ప్రత్యేక ప్రజా ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి. గురువారం నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించేందుకు నిర్ణయించాయి. అడ్డుకునేందుకు యత్నిస్తున్న పోలీసుల తీరును ఎండగడుతూనే యువశక్తిని జాగృతం చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షపార్టీ వైఎస్సార్‌సీపీ తనదైన ప్రణాళికతో పోరుకు సిద్ధమైంది. రాజకీయాలకు అతీతంగా హోదా సాధనకు యువతరం ముందుకు రావాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపును వాడవాడలా వినిపిస్తూ యువజన, విద్యార్థి, కార్మిక సంఘాలను ఏకం చేస్తోంది.
తిరుపతి : ప్రత్యేక హోదా సాధన కోసం జిల్లాలోని యువశక్తి ఏకమైంది. ప్రధాన రాజకీయ, విద్యార్థి, యువజన, కార్మిక విభాగాల్లో కీలకమైన యువ నాయకులు బుధవారం తిరుపతిలో సమావేశమై గురువారం చేపట్టే ఉద్యమంపై సమీక్షించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. హోదా సాధన కోసం ఎంత దూరమైనా వెళతామని ప్రతిన బూనారు. పోలీసులు కల్పిస్తున్న అడ్డంకులను సైతం అధిగమిస్తామని, విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓబుల్‌రెడ్డిలు ఒకే వేదికపై ఉద్యమ పోరును ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మరోవైపు కాపు యువజన నాయకులు, జనసేన యువనేత కిరణ్‌రాయల్ కూడా ప్రత్యేక పోరులో భాగస్వాములం అవుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరును బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఉదయం ఎస్వీ యూనివర్సిటీలో యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తలపెట్టిన ప్రత్యేక మౌనదీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం ఉద్యమానికి మద్దతు పలికాయి. బుధవారం సాయంత్రం నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నగరిలో పెద్ద ఎత్తున కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. గుడ్డి ప్రభుత్వానికి గడ్డి పెట్టండంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా శక్తిని కూడదీసి ప్రత్యేక ఉద్యమానికి కార్యోన్ముఖులను చేస్తున్నారు.
చంద్రగిరిలో భారీ మానవహారం...
ఇదిలా ఉండగా ప్రత్యేక పోరుకు మంగళవారం జలదీక్షతో శ్రీకారం చుట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం సాయంత్రం చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పెద్ద ఎత్తున మానవహారాన్ని ఏర్పాటు చేశారు. యువకులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి గురువారం సాయంత్రం చిత్తూరులో జరిగే కేండిల్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కూడా ప్రత్యేక పోరుకు మద్దతు పలికారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనీ, చంద్రబాబు సర్కారు కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదని దుయ్యబట్టారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్య బద్దంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన తరుణమిదేనని చింతా మోహన్ పిలుపునిచ్చారు.
నేడు వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ప్రదర్శన...
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సాయంత్రం చిత్తూరులో ప్రత్యేక హోదా సాధన కోసం సంఘటిత శక్తిని వ్యక్తీకరిస్తూ, ప్రభుత్వ తీరును ఎండగడుతూ భారీ కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, చిత్తూరు సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 4 వేల మంది పాల్గొంటారని అంచనా. సాయంత్రం 4 గంటలకు గాంధీబొమ్మ సెంటర్ నుంచి కేండిల్ ప్రదర్శన మొదలై చర్చిస్ట్రీట్ గుండా సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్ తదితరులంతా హాజరు కానున్నారు.