పతాక స్థాయికి పోరాటం | fighting the cutting edge | Sakshi
Sakshi News home page

పతాక స్థాయికి పోరాటం

Published Sun, Apr 9 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

పతాక స్థాయికి పోరాటం

పతాక స్థాయికి పోరాటం

నరసాపురం : ఏడాదిన్నరగా ఉధృతంగా సాగుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలంటూ ప్రజలు సాగిస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల సాయంతో ప్రభుత్వం దమనకాండకు దిగుతున్న విషయం విదితమే. సర్కారు తీరు, ఆక్వా పార్క్‌ యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరి, నిత్యం ముట్టడిస్తున్న పోలీసు బలగాల నడుమ 40 గ్రామాల ప్రజలు సుమారు ఏడాది కాలంగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగిస్తున్న అరాచకాలతో వణికిపోతున్నారు. తమ జీవనాన్ని కాపాడుకునేందుకు.. భవిష్యత్‌ తరాలను కాలుష్యం బారినుంచి రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు అన్నిటినీ భరిస్తూ ఆందోళనలు చేసూ్తనే ఉన్నారు. ఎప్పుడూ రోడ్డెక్కని మహిళలు లాఠీదెబ్బలు సైతం తిన్నారు. జైళ్లకు సైతం వెళ్లారు. పొరుగునే ఉన్న మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మరణించటంతో వణికిపోయారు. ఆక్వా పార్క్‌ నిర్మా ణం పూర్తయితే ఇంతకంటే తీవ్రమైన దుర్ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ ఉద్యమ తీవ్రతను పెంచింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షతో పోరాటం మరింత వేడెక్కింది. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు, వీరవాసం మండలాల పరిధిలోని గొంతేరు డ్రెయిన్‌ పరీవాహక ప్రాంతా ల్లోని దాదాపు 40 గ్రామాల ప్రజలు తరలివచ్చి ముదునూరి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆక్వా పార్క్‌ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్‌ కాలుష్య కాసారమవుతుందని గగ్గోలు పెట్టారు. పంటలు నాశనమైపోతాయని రైతులు, ఉపాధి కరువవుతుందని మత్స్యకారులు, ఆరోగ్యాలు పాడవుతాయని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే సత్తా చూపుతామని,  తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముదునూరి చేపట్టిన దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. ఈ పోరాటం అంతం కాదని, మరింత తీవ్రంగా ఆరంభమవుతుందని దీక్ష అనంతరం ప్రసాదరాజు ప్రకటించారు. 
నిప్పులు చెరిగిన రోజా
ఆక్వా పార్క్‌ విషయంలో చంద్రబాబు తీరు, ప్రజలపై సాగి స్తున్న దమనకాండపై వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు లంచాలు తీసుకున్నారు కాబట్టే ఆక్వా పార్క్‌ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మహిళా దినోత్సవం రోజునే మహిళలను కొట్టిస్తావా చంద్రబాబూ.. 15మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లాకు నీవిచ్చే బహుమతి ఇదేనా’ అని నిలదీశారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు ప్రాంతం నుంచి జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలి్సందేనని డిమాండ్‌ చేశారు. మొగల్తూరు నల్లంవారి తోటలో ఇదే యాజమాన్యం నిర్వహిస్తున్న 10 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని.. తుందుర్రులో ఆక్వా పార్క్‌ నిర్మించి ఇంకెంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం చేతులు దలుపుకుంటే సరిపోతుందా అని ప్రశ్నిం చారు. యాజమాన్యంపై చర్యల తోపాటు ఫ్యాక్టరీ లైసెన్స్‌లు రద్దు చేయడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. 
మేధా పాట్కర్‌ రాకతో..
ప్రముఖ పర్యావరణవేత్త, నర్మదా బచావో ఉద్యమ నిర్మాత మేధా పాట్కర్‌ శనివారం రాత్రి కంసాలి బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో పర్యటిం చారు. ఆక్వా పార్క్‌ నిర్మాణానికి వ్యతి రేకంగా పోరాడుతున్న ప్రజలతో భేటీ అయ్యారు. తుందుర్రు, కంసాలి బేతపూడి తదితర గ్రామాల్లో ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ గురించి తెలుసుకున్న ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో అరాచకాలు, పర్యావరణ ముప్పునకు రాష్ట్ర ప్రభుత్వమే బీజాలు వేసే ప్రయత్నాలపై జాతీయ స్థాయిలో చర్చ పెడతానని ప్రకటించారు. మొత్తంగా ఈ పరిణా మాల నడుమ ఆక్వా పార్క్‌ ఉద్యమంలో వేడి మరింత రాజుకుంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement