ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
కంకిపాడు : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డీ.శ్రీను డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డిని విజయవాడలో గురువారం కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందించారు. ప్రొద్దుటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉద్యోగ విరమణల కారణంగా జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన ఇబ్బందికరంగా మారిందన్నారు. నెలవారీ ప్రమోషన్ కౌన్సెలింగ్ విధానం ద్వారా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాప్రమాణాల మెరుగునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సీనియారిటీ జాబితా అనుమతి కోసం ఆర్‌జేడీకి నివేదించామని, అన్ని క్యాడర్ పోస్టులు ప్రమోషన్ కౌన్సిలింగ్ విధానంలో చేస్తామని డీఈవో సుబ్బారెడ్డి మామీ ఇచ్చారన్నారు. 2009-10 సంవత్సరంలో జిల్లాలో కొందరు ఉపాధ్యాయుల అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్లు నకిలీవనే ఆరోపణలపై సీబీసీఐడీ విచారణ చేసిందన్నారు. విచారణ పూర్తిచేసిన నకిలీవి కావని ధ్రువీకరించిన సర్టిఫికెట్లు డీఈవో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్లు ఏ.వీ. సుబ్రహ్మణ్యం, డీ. కార్తీక్, వీ.ఎస్. బోస్ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు.